Share News

కన్నెపల్లి పంపులను ఆన్‌ చేయండి

ABN , Publish Date - Jul 11 , 2026 | 06:09 AM

రాష్ట్రవ్యాప్తంగా కరువుు ఘంటికలు మోగుతున్న దృష్ట్యా ప్రాణహిత నుంచి వృథాగా పోతున్న జలాలను కన్నెపల్లి పంప్‌హౌజ్‌ నుంచి ఎత్తిపోయాలని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌..

కన్నెపల్లి పంపులను ఆన్‌ చేయండి

  • రాజకీయాలు కాదు, రైతుల బాధ అర్థం చేసుకోండి

  • సీఎం రేవంత్‌కు ఈటల డిమాండ్‌

  • తనకు తెలంగాణ ఫస్ట్‌ .. పార్టీ నెక్స్ట్‌ అన్న బీజేపీ ఎంపీ

హైదరాబాద్‌, బోయినపల్లి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా కరువుు ఘంటికలు మోగుతున్న దృష్ట్యా ప్రాణహిత నుంచి వృథాగా పోతున్న జలాలను కన్నెపల్లి పంప్‌హౌజ్‌ నుంచి ఎత్తిపోయాలని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిదేనని స్పష్టం చేశారు. ఈ మేరకు రిటైర్డు ఇంజనీర్లతో కలిసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీని నింపాలని గానీ, చుక్క నీరు నిల్వ చేయాలని గానీ తాము కోరడం లేదని ఈటల స్పష్టం చేశారు. ప్రాణహిత నుంచి వెళుతున్న నీరు కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి ఎత్తిపోయడానికి అనుకూలంగా ఉందని, ఆ నీటిని పంపింగ్‌ చేసి రైతులకు ఇవ్వాలని అడుగుతున్నామని అన్నారు. కన్నెపల్లి నుంచి నీటిని పంపింగ్‌ చేసి అన్నారంలో వేయాలని, అన్నారం నుంచి సుందిళ్లకు, అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించవచ్చని ఈటల తెలిపారు. ఎల్లంపల్లి నుంచి ఎక్కడికైనా ఎన్ని టీఎంసీలనైనా పంపింగ్‌ చేసుకునే అవకాశం ఉందని వివరించారు. రాజకీయాలు అడ్డుపెట్టుకుని రైతుల జీవితాలతో చెలగాటమాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. సీఎం రేవంత్‌, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేషజాలకు వెళ్లకుండా, రాజకీయాలు చేయకుండా రైతుల ఆందోళనను అర్థం చేసుకోవాలని కోరారు.


ఇప్పటికే వేసిన విత్తనాలకు కుండలతో, ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారని, కనీసం ఒక్క తడికి నీరిచ్చినా పంట నిలుస్తుందని తెలిపారు. కాగా, తెలంగాణ బిడ్డనైన తనకు ‘తెలంగాణ ఫస్ట్‌... తర్వాత పార్టీ . తర్వాతే నేను’ అని ఈటల చెప్పారు. రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం ఎవరు చేసినా ఏ పార్టీ చేసినా ప్రేక్షకపాత్ర పోషించబోనని స్పష్టం చేశారు. ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడితే అక్కడ తాను ఉంటాని, ఏకే 47తో కణతకు గురిపెట్టినా తన నైజం మారదని ఈటల పేర్కొన్నారు. కాగా, బీఆర్‌ఎస్‌ను బోనులో నిలబెట్టే ఉద్దేశంతో ఉత్తర తెలంగాణ రైతులను, హైదరాబాద్‌ ప్రజలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Jul 11 , 2026 | 06:10 AM