ఈటలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:26 AM
బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా కేపీహెచ్‌బీ, మల్కాజిగిరి, సికింద్రాబాద్ ప్రాంతాలతో పాటు గుండ్లపోచంపల్లి డివిజన్ మునీరాబాద్ ....
కూకట్‌పల్లి, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌తో పాటు ఆయన ఇంటి ముందు కూడా ఏర్పాటు
బీజేపీ మీ కోసం నిలబడితే పార్టీకి మీరు చేసింది ఏంటంటూ ప్రశ్నలు
బీఆర్‌ఎస్‌లో పరిస్థితే బీజేపీలోనూ తెచ్చుకోవద్దంటూ విమర్శలు
ఈటలపై వ్యతిరేక ప్రచారాన్ని ఖండించిన పార్టీ నాయకులు
బీజేపీని బలహీనపరిచేందుకు కుట్ర: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
కేపీహెచ్‌బీ కాలనీ/హైదరాబాద్/ఘట్‌కేసర్ రూరల్/మేడ్చల్ టౌన్, మే 31(ఆంధ్రజ్యోతి): బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా కేపీహెచ్‌బీ, మల్కాజిగిరి, సికింద్రాబాద్ ప్రాంతాలతో పాటు గుండ్లపోచంపల్లి డివిజన్ మునీరాబాద్ సమీపంలోని ఆయన ఇంటి ముందు కూడా ఫ్లెక్సీలు వెలిశాయి. ‘బీజేపీ నీ కోసం నిలబడితే నువ్వు బీజేపికి చేసింది ఏంటి? అసలు నీ వల్ల బీజేపీకి జరిగిన మేలేంటి?’ అనే ప్రశ్నలతో కూడిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు మెట్రో ఫుట్‌పాత్ రెయిలింగ్‌లు, విద్యుత్ స్తంభాలకు కట్టారు. ఈ వ్యవహారం స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఈ చర్యను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఖండిస్తూ పార్టీని బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఏర్పాటు చేసినట్టు భావిస్తున్న ఫ్లెక్సీలు మరుసటి రోజు ఆదివారం కన్పించలేదు. అయితే అప్పటికే అవి సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ‘బీజేపీ ఎన్నో అవకాశాలు కల్పించి పెద్ద నాయకుడిని చేసింది. నీకింకా అసంతృప్తి దేనికి ఈటల’ అని ఒక ఫ్లెక్సీలో రాసుకొచ్చారు. ‘టీఆర్‌ఎస్‌కు ఓనర్‌ను నేనే అంటేనే కదా కేసీఆర్ మెడపట్టి నిన్ను బయటకు నెట్టింది. ఇప్పుడే అదే పరిస్థితి బీజేపీలో తెచ్చుకోకు’ అని మరో ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ‘పార్టీ నా చుట్టూ తిరగాలి. నేను చెప్పిందే అందరూ వినాలి’ అన్న ఈటల అహంకారంతో బీజేపీ పట్టు కోల్పోతోందని రాశారు. పార్టీ కంటే వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేయడం వల్లే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. గ్రూపు రాజకీయాలు, డబ్బున్న వారిని అందలం ఎక్కించే ప్రయత్నం మంచిది కాదని రాసుకొచ్చారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని, కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదని ఈటల ఏడుపని, అదే బీజేపీకి శాపమని విమర్శించారు. పార్టీ కోసం పనిచేసే వారిని పక్కన పెట్టడం, తనను జోకే వారినే ప్రోత్సహించడం వల్ల పార్టీకి తీవ్ర నష్టమని పేర్కొన్నారు. కాగా, తమ పార్టీ నేతల మధ్య విభేదాలు సృష్టించేందుకు కొన్ని పార్టీలు, శక్తులు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని రాంచందర్‌రావు ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ ఫ్లెక్సీల ఘటనపై దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను కోరినట్లు తెలిపారు. ఈటలపై దుష్ప్రచారం సమంజసం కాదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఖండించారు. ‘ఈటల, కేంద్ర మంత్రి బండి సంజయ్, నాకు మధ్య గొడవలు నూటికి నూరు శాతం అబద్ధం. సంజయ్‌కు నాకు మధ్య సోదరభావం తప్ప మరోటి లేద’ని అర్వింద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈటలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలిపారు. కాగా, రాష్ట్రంలో ప్రజలు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఎదురు చూస్తున్నారని రాంచందర్‌రావు అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం అవుశాపూర్ విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. అందరూ ఐక్యంగా ఉండి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని పిలుపునిచ్చారు.