సంఘటన్ పర్వ్‌లో కీలక పాత్ర గర్వకారణం
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:43 AM
సంఘటన్ పర్వ్‌లో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో రిటర్నింగ్ ఆఫీసర్‌గా కీలక బాధ్యతలు సమర్థంగా నిర్వహించిన రాజ్యసభ సభ్యుడు...
బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌కు రాంచందర్ రావు ఘన సన్మానం
హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : సంఘటన్ పర్వ్‌లో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో రిటర్నింగ్ ఆఫీసర్‌గా కీలక బాధ్యతలు సమర్థంగా నిర్వహించిన రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్‌ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఘనంగా సన్మానించారు. సోమవారం రాష్ట్ర కార్యాలయంలో సన్మానం అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ ఒక విశిష్టమైన, క్రమబద్ధమైన సంస్థాగత సంస్కృతి కలిగిన రాజకీయ పార్టీ అని పేర్కొన్నారు. దేశంలోని ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా బీజేపీ సాధారణ కార్యకర్తకు కూడా అంకితభావం, క్రమశిక్షణ, సేవాభావం ఉంటే పార్టీలో అత్యున్నత స్థాయులకు ఎదిగే అవకాశాన్ని కల్పిస్తుందని స్పష్టం చేశారు. సంఘటన్ పర్వ్ వంటి అత్యంత కీలక దశలో జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, క్రమశిక్షణతో విజయవంతంగా నిర్వహించడంలో లక్ష్మణ్ పోషించిన పాత్ర ప్రశంసనీయమని అన్నారు. లక్ష్మణ్ సేవలు పార్టీకి గర్వకారణమని, ఇలాంటి బాధ్యతాయుతమైన నాయకత్వమే పార్టీని నిరంతరం బలోపేతం చేస్తోందని తెలంగాణ బీజేపీ నాయకత్వం అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ప్రధాన కార్యదర్శులు డా.ఎన్. గౌతమ్ రావు, సీనియర్ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి తదితరులు లక్ష్మణ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.