Sudheer Reddy: డ్రగ్స్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:10 AM
కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డితో పాటు మరొకరు డ్రగ్స్ తీసుకుంటుండగా హైదరాబాద్.....
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఈగల్ బృందం
ఆది కుమారుడు సుధీర్‌రెడ్డిపై కేసు నమోదు
హైదరాబాద్, జనవరి 3(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డితో పాటు మరొకరు డ్రగ్స్ తీసుకుంటుండగా హైదరాబాద్ ‘ఈగల్’ బృందం అధికారులు శనివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. నానక్‌రాం గూడలోని గేటెడ్ కమ్యూనిటీలో కొంతమంది డ్రగ్స్ సేవిస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో ఈగల్ బృందం అధికారులు రంగంలో దిగారు. నార్సింగ్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. గేటెడ్ కమ్యూనిటీలోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన పోలీసు బృందానికి సుధీర్ రెడ్డితో పాటు మరో వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటూ కనిపించడంతో మత్తు పదార్థాలతోపాటు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం.. పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లి టెస్టులు చేయగా ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. దీంతో వీరిని డీ అడిక్షన్ కేంద్రానికి తరలించారు. సుధీర్‌రెడ్డి గతంలో రెండు సార్లు మత్తు పదార్థాలు తీసుకుంటూ పోలీసులకు పట్టుబడిన నేపథ్యంలో అతనిపై ఈగల్ బృందాలు నిఘాను కొనసాగించాయి. తాజాగా మూడోసారి పట్టుబడటంతో డీ అడిక్షన్ సెంటర్‌కు పంపించామని పోలీసులు తెలిపారు. మరోవైపు, సుధీర్‌కు డ్రగ్స్ సరఫరా చేసిన వారెవరు?, తరచు ఇంటికే ఎలా అందుతున్నాయి?.. అనే కోణంలో విచారణ చేస్తున్నట్టు ఈగల్ అధికారులు చెప్పారు.