Share News

తలపై అన్నదాతల అర్జీలను మోస్తూ అసెంబ్లీకి..

ABN , Publish Date - Mar 18 , 2026 | 05:10 AM

రాష్ట్రంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం వినూత్న రీతిలో నిరసన వ్యక్తంచేశారు. ఉదయం అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి...

తలపై అన్నదాతల అర్జీలను మోస్తూ అసెంబ్లీకి..

గన్‌పార్క్‌ వద్ద రైతులతో కలిసి బీజేపీ ఎమ్మెల్యేల నిరసన

రాష్ట్రంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం వినూత్న రీతిలో నిరసన వ్యక్తంచేశారు. ఉదయం అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి, ఉపనేత పాయల్‌ శంకర్‌ రైతులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. వివిధ పథకాల కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి బీజేపీ నేతలు స్వీకరించిన సుమారు లక్ష దరఖాస్తులను తలపై మోసుకుంటూ అసెంబ్లీ ముందు ఉన్న గన్‌పార్క్‌ వరకు పాదయాత్రగా వెళ్లి నిరసన తెలిపారు. అక్కడి నుంచి అసెంబ్లీ మెయిన్‌ గేట్‌ వద్దకు చేరుకోగా, మార్షల్స్‌ వారిని అడ్డుకొని దరఖాస్తు పత్రాలను తీసేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు మార్షల్స్‌కు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ధైర్యముంటే ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను అరెస్టు చేయాలని ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వందేమాతర గీతాన్ని గౌరవించని వారిని అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ఈ సందర్భంగా పాయల్‌శంకర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వెంటనే ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. నిరసన ప్రదర్శనలో ఎమ్మెల్యేలు రామారావు పాటిల్‌, హరీష్‌ బాబు, ధనపాల్‌ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి పాల్గొన్నారు.

ఇప్పుడు నేనే ట్రెండింగ్‌ స్టార్‌: మల్లారెడ్డి

ఇప్పుడు తానే ట్రెండింగ్‌ స్టార్‌ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి సరదా వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. సోషల్‌ మీడియాను ప్రమోట్‌ చేస్తుందని తానేనని అన్నారు. ‘సినిమావాళ్లు అవకాశం ఇచ్చేది ఏందీ.. నేనే స్టార్‌ను’ అంటూ వ్యాఖ్యానించారు. అవసరమమైతే తానే సినిమా తీస్తానని పేర్కొన్నారు.

Updated Date - Mar 18 , 2026 | 05:10 AM