Share News

రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణలేని అప్పుల జాతర

ABN , Publish Date - Mar 19 , 2026 | 04:45 AM

రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే చెప్పించిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణలేని అప్పుల జాతర

  • గవర్నర్‌ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే చెప్పించారు.. విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యమివ్వడం లేదు

  • విద్యావంతులు, బీసీలకు కోళ్లశాఖనో, చేపల శాఖనా?: ఏలేటి

  • మంత్రులు, శాఖలను తక్కువ చేసి మాట్లాడొద్దు: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే చెప్పించిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప.. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలను చెప్పించలేద ని, గవర్నర్‌ ప్రసంగం హామీల ఎగవేతకు డిక్లరేషన్‌గా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు 5 శాతానికి పడిపోయాయని, తెలంగాణలో ఆర్థిక క్రమశిక్షణ లేని అప్పుల జాతర నడుస్తోందని దుయ్యబట్టారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పలా ఉంటే.. మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని భ్రమలు కల్పిస్తున్నారని, ఇది ఎలా సాధ్యమౌతుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘దేశంలోని పలు రాష్ట్రాల్లో విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో విద్యా శాఖకు కనీసం 10 శాతం, వైద్య రంగానికి 15 శాతం బడ్జెట్‌ కూడా కేటాయించట్లేదు. సీఎం రేవంత్‌రెడ్డి పాలన రైతుల పట్ల యమపాశంగా మారింది. భూభారతి పేరిట భూహారతి కార్యక్రమం నడుస్తోంది. ఎన్‌ఓసీ ఇస్తేనే.. నిషేధిత జాబితాలో నుంచి తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే.. అది నో ఆబ్జెక్షన్‌ టు చీఫ్‌ మినిస్టర్‌.. ఆయన చెబితేనే.. నిషేధిత జాబితాలో నుంచి తొలగించే విధానాన్ని తెచ్చారు. అసలు కీలక శాఖలకు మంత్రులే లేరు. విద్యావంతులు, బీసీ నేతలకు ఏ కోళ్ల శాఖనో, చేపల శాఖనో ఇచ్చి సరిపుచ్చుతున్నారు. పురపాలక, విద్య, హోంశాఖ వంటి శాఖలను ఎందుకు కేటాయించట్లేదు’ అని నిలదీశారు. అసెంబ్లీ సాక్షిగా వందేమాతరం పాడుతున్న సమయంలో కొందరు సభ్యులు బయటకు వెళ్లిపోవడం తగదని, వారిపై స్పీకర్‌ తగిన చర్యలు చేపట్టాలని ఏలేటి డిమాండ్‌ చేశారు.

ఆ మాటలు వెనక్కి తీసుకో: శ్రీధర్‌ బాబు

‘ఏ శాఖలు నిర్వహిస్తున్నా.. అంతా మంత్రులే కదా..? వారి హోదా, నిర్వహణ బాధ్యత ఒక్కటి కాదా..?’ అంటూ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. రాష్ట్ర క్యాబినెట్‌లో అన్ని శాఖలూ కీలకమేనన్నారు. మంత్రులు, శాఖలను తక్కువ చేసి మాట్లాడటం తగదని.. దీనిపై ఏలేటి తన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘మీ పార్టీకి చెందిన బీసీ నేత బండి సంజయ్‌కు సహాయ మంత్రి పదవే ఎందుకిచ్చారని.. పూర్తిస్థాయి మంత్రి పదవి ఎందుకు కేటాయించలేదని నిలదీశామా..?’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ సర్కారుపై విమర్శలు చేయడం కాదని.. తెలంగాణ అభివృద్ధి పట్ల బాధ్యత ఉంటే కేంద్రంలోని మీ బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు తేవాలంటూ ఏలేటికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచించారు.

Updated Date - Mar 19 , 2026 | 04:45 AM