Share News

25మంది ఎమ్మెల్యేల రహస్య మంతనాలు

ABN , Publish Date - Feb 25 , 2026 | 02:06 AM

కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో కూడా అధికార కాంగ్రెస్‌ పార్టీలో ముసలం ప్రారంభమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

25మంది ఎమ్మెల్యేల రహస్య మంతనాలు

  • అధికార కాంగ్రెస్‌లో ముసలం.. రేవంత్‌ సర్కార్‌కు నో గ్యారంటీ.. మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేల రహస్య భేటీలు

  • బీఆర్‌ఎస్‌ మునిగిపోయిన నావ

  • కరీంనగర్‌లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌‌లకు దిమ్మదిరిగే షాక్‌

  • కేంద్రమంత్రి బండి సంజయ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో కూడా అధికార కాంగ్రెస్‌ పార్టీలో ముసలం ప్రారంభమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. 25 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఫోన్‌లో మాట్లాడుకున్నారని చెప్పారు. మంత్రి పదవుల కోసం రెండు జిల్లాల ఎమ్మెల్యేలు రహస్య భేటీలు నిర్వహించారన్నారు. కరీంనగర్‌ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని మునిసిపాలిటీల కౌన్సిలర్లు, కరీంనగర్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్లను మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సన్మానించారు. తర్వాత పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సంజయ్‌ మాట్లాడుతూ.. ‘‘8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సోమవారం ఓ చోట రహస్యంగా భేటీ అయ్యారు. మంత్రుల కమీషన్లు, కలెక్షన్లపై చర్చించుకున్నారు.. వారి అవినీతి వల్ల పార్టీ భ్రష్ఠు పట్టిపోతోంది. మంత్రులుగా మాకు అవకాశం ఇవ్వండి అంటూ రాహుల్‌గాంధీకి లేఖరాశారు. ఇది వాస్తవం’ అని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, తమకు నిధులివ్వడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నారాజ్‌గా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ నేతలు తమ ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ప్రతిపక్షాలకు ఇవ్వరని, వారే ఆ పని చేస్తారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ‘మునిగిపోయిన’ నావ అని పేర్కొన్న సంజయ్‌.. ఆ పార్టీని రక్షించడం ఎవరి తరమూ కాదని తేల్చిచెప్పారు. మునిసిపల్‌ ఎన్నికల్లో 7 కార్పోరేషన్లలో ఆ పార్టీ అడ్రస్‌ గల్లంతు కాగా, అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు అభ్యర్థులే దొరక లేదన్నారు. ‘కరీంనగర్‌ నగర పాలక సంస్థను బీజేపీ గెలుచుకోవడం మామూలు విషయం కాదు. ఇదొక కల. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కుమ్మక్కై మేయర్‌ పదవి బీజేపీకి దక్కకుండా కుట్ర చేశాయి. కానీ, ముగ్గురు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ఆ పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేసి స్వచ్ఛందంగా బయటికొచ్చి బీజేపీకి మద్దతునిచ్చారు.’ అని సంజయ్‌ అన్నారు. ‘ సంజయ్‌ అనే నేను పార్టీలో లేకుంటే కుక్కలు కూడా పట్టించుకోవు. మా పార్టీలో ప్రతి కార్యకర్తకూ బీజేపీ కార్యాలయమే ఓ దేవాలయం, పార్టీకంటే మేమే గొప్ప అనుకున్న వారంతా తెర మరుగయ్యారు’ అని సంజయ్‌ పేర్కొన్నారు.


స్వర్ణ దేవాలయంలా భాగ్యలక్ష్మి టెంపుల్‌

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ బూట్లు నాకాల్సిందేనని మజ్లిస్‌ నేతలు చెబుతున్నారంటే.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలకు సిగ్గుండాలని సంజయ్‌ మండి పడ్డారు. హైదరాబాద్‌లో హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్‌ టెంపుల్‌గా తీర్చి దిద్దుతామని సంజయ్‌ చెప్పారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘అమ్మవారి శక్తి తెలిసే ఇక్కడి నుంచే చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 1640 రోజులు 1640 కి.మీ దూరం సాగింది’’ అని చెప్పారు.

Updated Date - Feb 25 , 2026 | 02:06 AM