Share News

మంత్రుల అవినీతి చిట్టా సిద్ధం!

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:06 AM

రాష్ట్ర మంత్రుల అవినీతి చిట్టాను వారి ఇళ్ల ముందే బయటపెడతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ చెప్పారు.

మంత్రుల అవినీతి చిట్టా సిద్ధం!

  • వారి ఇళ్ల ముందే బయటపెడతాం.. మంత్రులకు మధ్యవర్తులుగా కొందరు ఐఏఎ్‌సలు

  • టీపీసీసీ కాదు.. టీ4సీ!

  • తెలంగాణ కలెక్షన్‌, కరప్షన్‌, కమీషన్‌ కాంగ్రెస్‌: బండి సంజయ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రుల అవినీతి చిట్టాను వారి ఇళ్ల ముందే బయటపెడతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ చెప్పారు. మంత్రులు ఎవరెవరి దగ్గర కమీషన్లు తీసుకున్నారనే వివరాలతో పాటు ఆడియో రికార్డులు కూడా తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. ‘‘కాంగ్రెస్‌ మంత్రుల చిట్టా మా దగ్గర ఉంది. వారి అవినీతికి సంబంధించిన ఆధారాలు కొన్ని సేకరించాం. మరికొన్ని సేకరిస్తున్నాం. ఒక్కో మంత్రికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తాం. వారి ఇళ్లను ముట్టడిస్తాం. నియోజకవర్గాల్లో అడ్డుకుంటాం. మంత్రులకు చెంచాగిరీ చేస్తూ, మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న కొందరు ఐఏఎ్‌సల రిపోర్టులు కూడా మా దగ్గరున్నాయి’’ అని సంజయ్‌ వివరించారు. కరీంనగర్‌ 10వ డివిజన్‌ ఇండిపెండెంట్‌ కార్పొరేటర్‌ సౌగాని కొమరయ్య గురువారం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాంచందర్‌రావుకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌లు, కార్పొరేటర్లు రాంచందర్‌రావును సన్మానించారు. అనంతరం కేంద్ర మంత్రి సంజయ్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కాంగ్రె్‌సను పెంచి పోషించడానికి తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెట్టుబడిగా పెడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీకి మూటలు అప్పగించడానికే కాంగ్రెస్‌ అధికారంలో ఉంది తప్ప, భాగ్యనగరాన్ని బాగుచేయడానికి కాదని అన్నారు. ‘టీపీసీసీ కాదది.. టీ4సీ.. తెలంగాణ కలెక్షన్‌, కరప్షన్‌, కమీషన్‌ కాంగ్రెస్‌’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో గాడిదగుడ్డు చూపించి ఓట్లు అడిగిన కాంగ్రెస్‌, ఇప్పుడు ఏ గుడ్డు చూపించి ఓట్లు అడుగుతుందో చెప్పాలని సంజయ్‌ సవాల్‌ చేశారు. 2047లో వికసిత్‌ భారత్‌ ఏర్పడే వరకూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉంటుందన్నారు. దేశంలో 2029లో ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ అధికారంలో ఉండబోదని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్‌ పేరిట నిర్వహించిన సదస్సులో అందాల పోటీలకు చేసిన ఖర్చుల మొత్తం కూడా పెట్టుబడుల రూపేణా రాలేదన్నారు. ఒవైసీ కళ్లల్లో ఆనందం చూడ్డానికే రేవంత్‌రెడ్డి జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేశారని సంజయ్‌ మండిపడ్డారు. భాగ్యనగర ప్రజలంతా రేవంత్‌ ముఖంలో మొద్దు శీనునే చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక వర్గం చేతిలో కాంగ్రెస్‌ కీలుబొమ్మగా మారిందని దుయ్యబట్టారు. ఏకపక్షంగా ఎందుకు మూడు ముక్కలు చేశారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.


జీహెచ్‌ఎంసీలోనూ బీజేపీ జెండా ఎగరేస్తాం

కరీంనగర్‌ కార్పొరేషన్‌ను బీజేపీ గెలుచుకోవడంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సహకారం మరవలేనిదని సంజయ్‌ చెప్పారు. ‘కరీంనగర్‌ ప్రజలు బీజేపీని ఆశీర్వదించి మెజారిటీ సీట్లు ఇస్తే మేయర్‌ పదవి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, మజ్లి్‌సలు చేసిన కుట్రలకు దీటుగా తీసుకోవాల్సిన చర్యలపై రాంచందర్‌రావు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చారు. మేయర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికే ఓటేయాలని బీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వం చెప్పినా.. ప్రజా తీర్పును గౌరవించిన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లకు అభినందనలు. ఏ పార్టీ మద్దతూ లేకుండా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను బీజేపీ కైవసం చేసుకుంది. ఇదే స్ఫూర్తితో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగరేస్తాం’ అని సంజయ్‌ ప్రకటించారు. ‘రెండేళ్ల పాలనలో జీహెచ్‌ఎంసీ పరిధిలో తట్ట మొరం పోసిన దాఖలాల్లేవ్‌. భాగ్యనగర్‌ ప్రజలంతా తిరగబడే రోజులు రాబోతున్నయ్‌. తెలంగాణ రైజింగ్‌ పేరుతో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఆ నిధులన్నీ ఎటుపోయాయి? దావో్‌సకు రెండు సార్లు వెళ్లి రూ.2.15 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని పెట్టుబడులు వచ్చాయి?’ అని నిలదీశారు.

Updated Date - Feb 20 , 2026 | 01:06 AM