మోదీ పర్యటన మోగిపోవాలె!
ABN , Publish Date - May 03 , 2026 | 04:49 AM
ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మూడోసారి ప్రధాని అయ్యాక మొదటిసారి ఆయన ఈ నెల 10వ తేదీన తెలంగాణకు ...
ప్రధాని రాష్ట్ర పర్యటనకు బీజేపీ భారీ ఏర్పాట్లు.. విస్తృత సన్నాహక సమావేశాలతో పార్టీలో జోష్
జన సమీకరణకు జిల్లాలవారీగా ఇన్‌చార్జిల నియామకం
సన్నాహక సమావేశాలతో రాంచందర్‌రావు, కిషన్‌రెడ్డి బిజీ
హైదరాబాద్/ మన్సూరాబాద్/ పేట్‌బషీర్‌బాగ్, మే 2(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మూడోసారి ప్రధాని అయ్యాక మొదటిసారి ఆయన ఈ నెల 10వ తేదీన తెలంగాణకు వస్తుండటంతో కనీవినీ ఎరుగని రీతిలో ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. పర్యటనలో భాగంగా ప్రధాని సుమారు రూ.8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనుండటంతో.. వీటికి భారీగా ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. రాష్ట్రం నలుమూలల నుంచి జన సమీకరణ కోసం ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని పర్యటన కోసం ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాలు, డివిజన్లవారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగసభకు పెద్దఎత్తున ప్రజలను తరలించేందుకు పార్టీ ముఖ్యనాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో జిల్లాకు ఒక సీనియర్ నేతకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు, కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు ప్రధాని పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాంచందర్‌రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ తొలిసారి రాష్ట్రానికి వస్తుండటంతో.. ఈ పర్యటనను ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నేతలు, కార్యకర్తలను సమాయత్తం చేసే పనిలో బిజీగా ఉన్నారు. మోదీ సభ తెలంగాణలో చరిత్రాత్మకం కాబోతోందని శనివారం ఆయన తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై విమర్శలకూ పదును పెడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మహిళలకు, హిందువులకు వ్యతిరేకమంటూ ఈ నెల 4, 6, 8 తేదీల్లో సోషల్‌మీడియాలో విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ తెలిపారు. మోదీ సభకు మల్కాజిగిరి నుంచి కనీసం లక్ష మందిని తరలిస్తామని స్థానిక బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.3,175 కోట్ల విలువైన జాతీయ రహదారుల విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం: కిషన్‌రెడ్డి
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మోదీ పర్యటనను విజయవంతం చేయాలని కోరుతూ ఆయన విస్తృత పర్యటనలు నిర్వహిస్తున్నారు. శనివారం నారాయణగూడలో వాల్‌రైటింగ్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఎల్‌బీనగర్ నియోజవకర్గ బీజేపీ కార్యక్తలతో నాగోల్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. కొంపల్లి సర్కిల్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన మేడ్చల్ జిల్లా బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. పదేళ్ల బీఆర్‌ఎస్, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం రూ.12 లక్షల కోట్ల అప్పుల ఊబిలో చిక్కి అంధకారంలోకి వెళ్లిందని విమర్శించారు. కుటుంబ పాలనకు స్వస్తి పలికితేనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై వచ్చే మూడేళ్లు యుద్ధం చేసేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మోదీ సభకు భారీగా యువత, ఇతర వర్గాల ప్రజలను తరలించాలని నేతలకు సూచించారు.
10న కాకతీయ టెక్స్‌టైల్ పార్కు ప్రారంభోత్సవం
వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ: కిషన్‌రెడ్డి
వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును ఈ నెల 10న ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ పార్కుతో దేశ వస్త్ర పరిశ్రమ రంగానికి మరింత ఊతం వస్తుందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో నిర్మించిన ఈ పార్కు.. టెక్స్‌టైల్ హబ్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 1,327 ఎకరాల్లో ఉన్న ఈ పార్కులో రూ.1695కోట్లతో సౌకర్యాలు కల్పించామని, ఇది దేశంలోనే అతిపెద్దదని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.6 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేయగా, ఇప్పటికే రూ.3,800 కోట్లపైగా పెట్టుబడులొచ్చాయని వివరించారు. ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అప్పరెల్(పీఎం మిత్ర) పథకం కింద బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా కాకతీయ టెక్స్‌టైల్ పార్కు ఎంపికైనట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.