ఇదేం పనితనం..?
ABN , Publish Date - Feb 15 , 2026 | 06:43 AM
రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోవటంపై ఆ పార్టీ అధిష్ఠానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
మునిసిపల్ ఫలితాలపై బీజేపీ అధిష్ఠానం సీరియస్
పార్టీ ఎంపీలున్న చోట్ల కూడా ఓడటంపై అసహనం
ప్రధాని మందలించినా నేతల్లో మార్పు లేదని ఫైర్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోవటంపై ఆ పార్టీ అధిష్ఠానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. రెండు నెలల క్రితం ప్రధాని మోదీ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి గురించి పార్టీ ఎంపీలను హెచ్చరించిన విధంగానే మునిసిపల్ ఫలితాలు రావడంపై పార్టీ పెద్దలు సీరియ్‌సగా ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ బలహీనపడుతున్నప్పటికీ.. ఆ స్థానాన్ని భర్తీ చేయటానికి రాష్ట్ర నాయకత్వం ప్రయత్నించటం లేదని మోదీ గత ఏడాది డిసెంబరు 11న పార్టీ నేతలను మందలించినట్లు ప్రచారం జరిగింది. పార్టీలో అంతర్గత విభేదాలు, ఎవరికి వారే అన్నట్లుగా ప్రవర్తించడాన్ని ఆయన వేలెత్తి చూపినప్పటికీ.. మునిసిపల్ ఎన్నికల్లో పలువురు బీజేపీ ఎంపీల నియోజకవర్గాల పరిధిలో పార్టీ చిత్తుగా ఓడిపోవడంపై అధిష్ఠానం పెద్దలు ఆశ్చర్యపోతున్నారు. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ నియోజకవర్గాల్లో తప్ప మిగతా చోట్ల ప్రభావం చూపకపోవటంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్ని రకాలుగా కృషి చేశారని, అయినా బీజేపీకి అనుకూలంగా రాజకీయ వాతావరణాన్ని సృష్టించడంలో పార్టీలోని ఇతర నేతలు విఫలమయ్యారని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా బయటి నుంచి వచ్చిన నేతలు ఈ ఎన్నికలను సీరియ్‌సగా తీసుకోలేదని గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌తో చేతులు కలిపే విషయంపై బీజేపీ త్వరలో ఒక నిర్ణయానికి కూడా రావచ్చని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పూర్తిగా బలహీనపడితేనే బీజేపీ వుంజుకుంటుందన్న అభిప్రాయం పార్టీ నేతల్లో ఇప్పటివరకు ఉందని, అది సరైన భావన కాకపోవచ్చని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు అన్నారు.