Share News

తెలంగాణపై మా నాయకత్వం దృష్టి పెట్టింది

ABN , Publish Date - Jun 27 , 2026 | 07:14 AM

రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడంపై అగ్రనాయకత్వం దృష్టి సారించిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు చెప్పారు. పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ రాష్ట్రంలో..

తెలంగాణపై మా నాయకత్వం దృష్టి పెట్టింది

  • పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యం

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

  • తుంగభద్ర జలాల్లో రాష్ట్ర వాటాపై సీఎం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌

హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడంపై అగ్రనాయకత్వం దృష్టి సారించిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు చెప్పారు. పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారని తెలిపారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణపై పార్టీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నెల వ్యవధిలో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోపాటు తాజాగా పార్టీ జాతీయ అధ్యక్షుడి రాష్ట్ర పర్యటనలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. నితిన్‌ నబీన్‌ పర్యటన రాష్ట్ర పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్నివ్వడం ఖాయమని తెలిపారు. నితిన్‌ నబీన్‌ ఆదివారం (ఈ నెల 28న) మధ్యాహ్నం 2.45 గంటలకు శంషాబాద్‌ చేరుకుంటారని, 30న తిరిగి ఢిల్లీ వెళతారని చెప్పారు.

కేంద్రంతో ఏం మాట్లాడారో రేవంత్‌ చెప్పాలి

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్‌.పాటిల్‌తో అంతర్గతంగా ఏం మాట్లాడారో సీఎం రేవంత్‌ వెల్లడించాలని రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. కర్ణాటకలోని నవేలి, ఏపీలోని గుండ్రేవుల ప్రాజెక్టులతో తుంగభద్ర జలాల్లో తెలంగాణ వాటా 16 టీఎంసీలకు గాను 5 టీఎంసీలే వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వాటాపై కేంద్ర మంత్రి నుంచి ఎలాంటి హామీ తీసుకున్నారో సీఎం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. సర్‌పై మజ్లిస్‌ ఎంపీ ఒవైసీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాంచందర్‌రావు ఆరోపించారు. పాస్‌పోర్టు పౌరసత్వ ధ్రువీకరణ పత్రం కాదని స్పష్టం చేశారు. దలైలామాకు కూడా భారత పాస్‌పోర్టు ఉన్నా, ఆయనకు ఇక్కడి పౌరసత్వం లేదని గుర్తు చేశారు.

Updated Date - Jun 27 , 2026 | 07:14 AM