రేవంత్‌కూ కేసీఆర్‌కు పట్టిన గతే
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:44 AM
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ‘ఆర్‌ఆర్ ట్యాక్స్’ను బయటపెట్టడంతో భయపడిన సీఎం రేవంత్‌రెడ్డి, తీవ్ర నిస్పృహకు లోనైనట్టు చెప్పారు.
‘ఆర్ ఆర్ ట్యాక్స్’పై నితిన్ నబీన్ మాట్లాడినందుకే సీఎం విమర్శలు
ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నది కాంగ్రెస్ నేతలే
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చిట్‌చాట్
హైదరాబాద్, జులై 1 (ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ‘ఆర్‌ఆర్ ట్యాక్స్’ను బయటపెట్టడంతో భయపడిన సీఎం రేవంత్‌రెడ్డి, తీవ్ర నిస్పృహకు లోనైనట్టు చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ మాదిరే ముఖ్యమంత్రి రేవంత్‌కూ ప్రజల చేతిలో ఓటమి తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ’ కు నితిన్ నబీన్ ఇచ్చిన పిలుపునకు రాష్ట్ర ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని చెప్పారు. దీంతో ఆందోళనతో, అభద్రతాభావంతో సీఎంకు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదని రాంచందర్‌రావు ఎద్దేవా చేశారు. ‘‘చాయ్‌వాలా ప్రధాని అవుతారా?’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ నాడు ఎద్దేవా చేస్తే ఏమైంది.? మోదీ ఒక్కసారి కాదు.. మూడోసారి కూడా ప్రధాని అయ్యారు. అలాగే, ప్రస్తుత కేంద్ర మంత్రి జేపీ నడ్డా, పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో లోగడ బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడితే.. నాటి సీఎం కేసీఆర్ కూడా రేవంత్ మాదిరే ఎద్దేవా చేశారు. దాంతో కేసీఆర్ సీఎం పదవి కోల్పోవడంతో పాటు ఆయన పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. ఇప్పుడు రేవంత్ పార్టీకి కూడా అదే గతి పట్టబోతోంది’’ అని రాంచందర్‌రావు తేల్చి చెప్పారు. బుధవారం, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని చెబుతూ, కాంగ్రెస్ నేతలే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని విమర్శించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కాంగ్రెస్ పార్టీ లేఖ రాయడం పజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాజకీయ వివాదంలోకి లాగడమేనని అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వం గడిచిన 12 ఏళ్లలో తెలంగాణాలో చేసిన అభివృద్ధిపై, కాంగ్రెస్ చేసిన మోసాలపై చర్చకు సిద్ధమని రాంచందర్‌రావు ప్రకటించారు. ‘రేవంత్‌కు ధైర్యముంటే సెక్రటేరియట్ గేటు వద్ద చర్చకు రావాలి’ అని సవాల్ విసిరారు. తమది ‘టీం బీజేపీ’ అని చెబుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు చేస్తామని ప్రకటించారు. ఫుల్‌టైం పొలిటీషియన్ రేవంత్ పట్ల పార్ట్‌టైం పొలిటీషియన్ రాహుల్ గాంధీ అప్రమత్తంగా ఉండాలని, లేదంటే ఆయన స్థానాన్ని రేవంత్ ఆక్రమించే అవకాశం ఉందని రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరేందుకు చాలా మంది క్యూలో ఉన్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏడాది పదవీకాలం పూర్తిచేసుకున్న రాంచందర్‌రావుకు ఎంపీ ఈటల రాజేందర్, పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
బీజేపీని ఏంచేయలేరు: సంబిత్ పాత్ర
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పతనంతో రేవంత్‌రెడ్డి అహంకారానికి చెక్ పడుతుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ కూడా అమిత్‌షా విషయంలో జోక్ చేశారని గుర్తు చేస్తూ.. ఆ తర్వాత ఫలితం ఏమైందో చూశారు కదా అని వ్యాఖ్యానించారు. ‘‘రేవంత్‌రెడ్డిజీ బీజేపీని అణగదొక్కేందుకు మీకు చేతనైనంత ప్రయత్నం చేయండి. కానీ, భారత ప్రజలకు బీజేపీపై ఇష్టం ఉంది. దాన్ని మీరు ఏం చేయలేరు’’ అని అన్నారు.
ప్రజలు రేవంత్‌ను నిజంగానే మార్చిపోయారు: బండి సంజయ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడి,్డ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పేరును ఎద్దేవా చేస్తూ మాట్లాడడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం తీవ్రంగా ఖండించారు. ‘నితిన్ నబీన్ పేరు గుర్తు లేదని నటించవచ్చు. కానీ, ప్రజలు మాత్రం రేవంత్ రెడ్డి పేరును నిజంగానే మరిచిపోయారు’ అని వ్యాఖ్యానించారు. అధికార మదంతో ఉన్న నాయకులు అహంకారాన్ని బలంగా, ఎద్దేవాన్ని రాజకీయ చాతుర్యంగా భావిస్తుంటారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు పశ్చిమ బెంగాల్‌లో మాదిరే అంత సమయం పడుతుందని రేవంత్ రెడ్డి అనుకుంటే అది పొరపాటేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు చూస్తుంటే అంత సమయం కూడా పట్టకపోవచ్చన్నారు. బీజేపీని తక్కువ అంచనా వేసినా నష్టం లేదంటూ.. ఇంతకంటే పెద్ద ప్రభుత్వాలను, శక్తిమంతమైన నాయకులను సైతం ఓడించిందంటూ బండి సంజయ్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.