Share News

బెంగాల్‌ కార్యకర్తలే మాకు స్ఫూర్తి

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:48 AM

తెలంగాణ పార్టీ కేడర్‌కు.. బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలు స్ఫూర్తి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు అన్నారు. బెంగాల్‌ ఫలితాలను...

బెంగాల్‌ కార్యకర్తలే మాకు స్ఫూర్తి

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

  • శ్యామాప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా నివాళులు

  • ముఖర్జీ ఆశయాలను కొనసాగిస్తాం: బండి సంజయ్‌

హైదరాబాద్‌/ రాంనగర్‌/ న్యూఢిల్లీ, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ పార్టీ కేడర్‌కు.. బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలు స్ఫూర్తి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు అన్నారు. బెంగాల్‌ ఫలితాలను ఇక్కడా పునరావృతం చేసే దిశగా పార్టీ కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. జనసంఘ్‌ స్థాపకులు డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్‌ దివ్‌స(వర్ధంతి) సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయడం కోసం శ్యామాప్రసాద్‌ ముఖర్జీ తన ప్రాణాలనే త్యాగం చేశారన్నారు. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ ఓ గొప్ప మేధావి అని, ఆయన బలిదానాన్ని స్ఫూర్తిగా తీసుకుని పోరాడితే రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఖాయమని మహారాష్ట్ర, హరియాణ మాజీ గవర్నర్లు విద్యాసాగర్‌రావు, దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. దేశపు అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్‌ అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసమే కేంద్రం పని చేస్తోందని స్పష్టం చేశారు. దేశ రక్షణ కోసం అణ్వస్త్రాలు ఉండాలనే ముఖర్జీ ఆకాంక్షిస్తే.. వాజ్‌పేయ్‌ నెరవేర్చారని అన్నారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం ద్వారా ముఖర్జీ కలను ప్రధాని మోదీ నెరవేర్చారని పేర్కొన్నారు. కాగా, బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళామందిర్‌లో బీజే వైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే నేతృత్వంలో ‘నమో జెన్‌ జెడ్‌’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వికసిత్‌ భారత్‌-2047 లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని ఎన్‌.రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. మోదీ నాయకత్వంలో దేశం గత 12 సంవత్సరాల్లో అన్నిరంగాల్లో అభివృద్ధి సాఽఽధించిందన్నారు. శాసనసభ పక్ష బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర యువతలో అపారమైన ప్రతిభ ఉందని.. కేంద్రం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Updated Date - Jun 24 , 2026 | 04:48 AM