Share News

తరుగు పేరిట 2,160 కోట్లు కొట్టేశారు

ABN , Publish Date - May 28 , 2026 | 03:56 AM

మరో పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డికి దమ్ముంటే.. ఆయన పదవీకాలం పూర్తి చేసుకోవాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సూచించారు.

తరుగు పేరిట 2,160 కోట్లు కొట్టేశారు

  • రేవంత్‌.. దమ్ముంటే నీ పదవీ కాలం పూర్తి చేసుకో.. హామీలను పక్కన బెట్టి రియల్‌ ఎస్టేట్‌ దందా: ఏలేటి

  • రైతులను ఆదుకోకపోతే గుణపాఠం తప్పదు: ఈటల

  • పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో బీజేపీ భరోసా యాత్ర

పెద్దపల్లి/భూపాలపల్లి, మే 27 (ఆంధ్రజ్యోతి): మరో పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డికి దమ్ముంటే.. ఆయన పదవీకాలం పూర్తి చేసుకోవాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సూచించారు. రేవంత్‌కు ఇప్పుడు కొడంగల్‌ నియోజకవర్గంలో గెలిచే సత్తా ఉందా అని ప్రశ్నించారు. క్వింటాల్‌ ధాన్యానికి 10కిలోల వరకు తరుగు తీస్తున్నారని, వాటి విలువ రూ.2,160 కోట్లు ఉంటుందని, ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తోందని ప్రశ్నించారు. రైతు గోస-బీజేపీ భరోసా యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు, మంథని మండలం గుంజపడుగు ధాన్యం కొనుగోలు కేంద్రం, భూపాలపల్లి జిల్లాలోని చెల్పూరు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం ఏలేటి మాట్లాడుతూ కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని పంట ఉత్పత్తులను విక్రయించుకునేందుకు 45రోజులుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీలను పక్కనపెట్టి ముఖ్యమంత్రి.. రియల్‌ఎస్టేట్‌ దందా చేస్తున్నారని విమర్శించారు. 80శాతం ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెబుతున్న సీఎం.. తమ వెంట రావాలని సవాల్‌ విసిరారు. రైతులను దోపిడీ చేస్తుంటే చేతులు కట్టుకొని కూర్చోలేమని, ప్రతిగింజ కొనుగోలు చేసే వరకు రైతులకు అండగా ఉంటామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా సకాలంలో డబ్బులు చెల్లించక రైతాంగాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో రైతుల నుంచి మక్కలను క్వింటాలకు 1700-1800కు కొనుగోలు చేస్తున్న దళారులు.. తిరిగి వాటిని కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఽ రైతులను ఆదుకోకపోతే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

Updated Date - May 28 , 2026 | 03:56 AM