Share News

కేసీఆర్‌ విచారణ బూటకం!

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:44 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్‌ విచారించడం ఓ బూటకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ఆరోపించారు.

కేసీఆర్‌ విచారణ బూటకం!

  • ఆయన, రేవంత్‌ది క్విడ్‌ప్రోకో

  • ఫోన్‌ ట్యాపింగ్‌ అసలు బాధితులం మేమే

  • రెండేళ్లయినా కేసును సాగదీస్తున్నారు

  • బాధ్యులను ఎందుకు అరెస్ట్‌ చేయలేదు?

  • మునిసిపాలిటీల్లో రూ.2500 కోట్ల స్కాం

  • పన్నుల డబ్బు కాంగ్రెస్‌ నేతల జేబుల్లోకి

  • బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు

  • కాంగ్రెస్‌ పాలనపై చార్జిషీట్‌ విడుదల

  • మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలకు పిలుపు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్‌ విచారించడం ఓ బూటకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ఆరోపించారు. కేసు పెట్టి రెండేళ్లు పూర్తయినా కాంగ్రెస్‌ సర్కారు ఇంకా విచారణ పేరిట కాలయాపన చేస్తోందని విమర్శించారు. అసలు ట్యాపింగ్‌ జరిగిందే బీజేపీ నాయకులపైన అన్నారు. తమ పార్టీ నాయకులపై కేసులు కూడా పెట్టారని గుర్తుచేశారు. ట్యాపింగ్‌తోనే మునుగోడులో బీజేపీని ఓడించానికి బీఆర్‌ఎస్‌ సర్కారు ప్రయత్నించిందన్నారు. కాంగ్రెస్‌ సర్కారు వచ్చి రెండేళ్లయినా నత్తనడకన విచారణ కొనసాగుతోందని, ఎవరిపైనా చర్యలు తీసుకోకుండా విచారణ మాత్రమే చేస్తున్నారని విమర్శించారు. బాధ్యులను ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో బీఆర్‌ఎస్‌ సర్కారు రేవంత్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, అందుకే ఇప్పుడు రేవంత్‌ సర్కారు కేసీఆర్‌పై చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. ఇది క్విడ్‌ప్రోకో కిందకే వస్తుందన్నారు. నాడు బీఆర్‌ఎస్‌ రేవంత్‌కు సాయం చేయగా.. ఇప్పుడు ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీకి సాయం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ సర్కారు కేవలం విచారణ పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఇది యాక్టింగ్‌ మాత్రమేనని, యాక్షన్‌ కాదని చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని మునిసిపాలిటీల్లో రూ.2500 కోట్ల కుంభకోణం జరిగిందని, ప్రజల నుంచి పన్నుల డబ్బులు కాంగ్రెస్‌ నేతల జేబుల్లోకి వెళుతున్నాయని రాంచందర్‌రావు విమర్శించారు. ఏ మునిసిపాలిటీలోనూ రోడ్లు, డ్రైనేజీలు లేవని.. కనీస మౌలిక వసతులు కొరవడ్డాయని ఆరోపించారు. ‘‘బూటకపు హామీలు-మోసపూరిత వాగ్దానాలు’’ పేరుతో కాంగ్రెస్‌ పాలనపై రూపొందించిన చార్జిషీట్‌ను సోమవారం తెలంగాణ మునిసిపల్‌ ఎన్నికల బీజేపీ ఇన్‌చార్జి ఆశిష్‌ షెలార్‌, మరో ఇన్‌చార్జి అశోక్‌ పర్ణామి, ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి రాంచందర్‌రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. 6 గ్యారెంటీలు, 420 హామీలతో మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. పట్టణాలు అస్తవ్యవస్తంగా మారాయన్నారు. రోడ్లు, తాగునీటి సరఫరా, డ్రైనేజీ పనులకు కేంద్రం నుంచి వచ్చే నిధులే ఆధారమవుతున్నాయని చెప్పారు.


వచ్చే మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అన్ని పట్టణాలను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో సమయానికి డబ్బులు అందక పదవీ విరమణ చేసిన 38 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కోరారు. రాష్ట్రంలో సుమారు 150 దేవాలయాలపై దాడులు జరిగినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఉస్మానియా వర్సిటీలో పర్యటించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పి రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో 40శాతం కమీషన్లతో పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ భవిష్యత్తును కాపాడాలంటే సేవ్‌ తెలంగాణ- ఓట్‌ ఫర్‌ బీజేపీ నినాదంతో ప్రజలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఆశిష్‌ షెలార్‌ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌ మోసగాళ్లని, రానున్న మునిసిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీలను ఓడించాలని కోరారు. పురపాలక ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు.

రెబల్స్‌ను 15 ఏళ్లు పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తాం

మునిసిపల్‌ ఎన్నికల్లో రెబల్స్‌గా పోటీ చేస్తే 15 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హెచ్చరించారు. భవిష్యత్తులోనూ అలాంటి వారిని తిరిగి పార్టీలో చేర్చుకోబోమని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా నామినేషన్లు వేసిన అభ్యర్థులు.. వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. సర్వే నివేదికల ఆధారంగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకే పార్టీ అవకాశం కల్పించిందని చెప్పారు. టికెట్‌ రాని వారు బాధపడడం సహజమని, పార్టీ కోసం పని చేసిన వారికి భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని తెలిపారు.

Updated Date - Feb 03 , 2026 | 03:44 AM