Ramchander Rao: బీఆర్‌ఎస్ ముక్కలు కావడం ఖాయం
ABN , Publish Date - Jan 18 , 2026 | 05:10 AM
బీఆర్‌ఎస్ పార్టీ త్వరలో ముక్కలవటం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు..
కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ
రాంచందర్‌రావు
సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలి: కిషన్‌రెడ్డి
సికింద్రాబాద్‌లో మల్కాజ్‌గిరి కలపొద్దు: ఈటల
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీ త్వరలో ముక్కలవటం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. దోచుకున్న ప్రజాధనాన్ని పంచుకోవడంలోనే బీఆర్‌ఎస్ నాయకులు నిమగ్నమయ్యారని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని విమర్శించారు. రాష్ట్ర రాజకీయాల్లో పోటీ కేవలం కాంగ్రెస్ - బీజేపీ మధ్యే ఉందని పేర్కొన్నారు. బీజేపీ మునిసిపాలిటీ ఎన్నికల విజయ్ సంకల్ప సమ్మేళనం సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్‌లో శనివారం జరిగింది. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లడం రావడం లేదంటే బహిరంగ సభలు పెట్టడం తప్ప పాలనపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందనేందుకు ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో భారీస్థాయిలో గెలిచిన తమ అభ్యర్థులే నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు 40 శాతం కమీషన్ ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. మంత్రుల మధ్య బహిరంగంగానే ఘర్షణలు జరుగుతున్నాయని, పారిశ్రామికవేత్తలను తుపాకులతో బెదిరించే పరిస్థితులు వచ్చాయని మండిపడ్డారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. గత 11 ఏళ్లలో కేంద్రం రాష్ర్టానికి సుమారు రూ.12 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని చెప్పారు. కేంద్రం యూరియా పంపిస్తుంటే.. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు దానిని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు. సికింద్రాబాద్ కేంద్రంగా మునిసిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సికింద్రాబాద్‌కు బదులు మల్కాజ్‌గిరి మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుండడం సరికాదని అన్నారు. ఈ విషయంలో సీఎం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. తాను ముస్లిం కావడం వల్లే అవకాశాలు రావడం లేదంటూ ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ చేసిన వ్యాఖ్యలు విచారకరమని కిషన్‌రెడ్డి అన్నారు.
ఎంఐఎంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పొత్తు: బండి
రాష్ట్రంలోని నాలుగు మునిసిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సతో మజ్లిస్ పొత్తు పెట్టుకుందని మరో కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు.. కరీంనగర్, నిజామాబాద్, భైంసా, నిర్మల్ వంటి ప్రాంతాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉండటంతో, డీలిమిటేషన్ పేరుతో ఓట్లను తారుమారు చేసి ఎంఐఎంకు ఎక్కువ సీట్లు వచ్చేలా కాంగ్రెస్ కుట్ర చేసిందని ఆరోపించారు. మజ్లి్‌సకు 10-12 సీట్లు వచ్చినా ఈ రెండు పార్టీల సహకారంతో మేయర్ స్థానాలు దక్కించుకోవాలని మజ్లిస్ ప్రణాళిక వేసిందని అన్నారు. జై శ్రీరాం అన్నా కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. రాంచందర్‌రావు నేతృత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని అన్నారు. మల్కాజ్‌గిరి మునిసిపల్ కార్పొరేషన్‌ను సికింద్రాబాద్‌లో కలపాలని కోరటం సరికాదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ‘ఇప్పుడు మల్కాజ్‌గిరి కార్పొరేషన్‌లో ఉన్న కార్పొరేటర్లంతా మల్కాజ్‌గిరి జిల్లాకు చెందినవారే. దీనిని సికింద్రాబాద్‌లో కలపాలి అనడం సరికాదు. ఇలా కోరేవారు నాడు అధికారంలో ఉన్నారు. అప్పుడు ఎందుకు సికింద్రాబాద్ పేరును జిల్లాకు పెట్టాలని అడగలేదు?’ అని ఈటల ప్రశ్నించారు. మునిసిపాలిటీల రిజర్వేషన్ల ఖరారులో అనేక అవకతవకలు జరిగాయని ఈటల ఆరోపించారు.