యోగాకు గుర్తింపు తెచ్చింది మోదీనే
ABN , Publish Date - Jun 22 , 2026 | 05:04 AM
భారతదేశ ప్రాచీన జీవన విధానంలో భాగమైన యోగా విశిష్టతను దాని ప్రాధాన్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు తెలియజేసి యోగాకు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చారని బీజేపీ ....
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
ఇందిరాపార్కులో యోగా దినోత్సవం
భారత్.. యోగ భూమి: బండి సంజయ్
కవాడిగూడ, కరీంనగర్ స్పోర్ట్స్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి) : భారతదేశ ప్రాచీన జీవన విధానంలో భాగమైన యోగా విశిష్టతను దాని ప్రాధాన్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు తెలియజేసి యోగాకు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఇందిరాపార్కులో బీజేపీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్, ఆర్. కృష్ణయ్య, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు మర్రి శశిధర్‌రెడ్డి తదితరులు హాజరై యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. నేడు విద్యార్థులు, యువత తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, దాన్ని నియంత్రణలో ఉంచుకుని ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి యోగాసనాలు అత్యంత కీలకమైన సాధనంగా ఉపయోగపడతాయని అన్నారు. ప్రతి విద్యార్థి, యువత యోగాను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగా అనేది భారత దేశం ప్రపంచానికి అందించిన అత్యంత విలువైన సంపద అని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. దీనిని ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన కోరారు. భారతదేశం యోగ భూమిగా గుర్తింపు పొందిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచమంతా ఒత్తిడి, ఆందోళనతోపాటు జీవన శైలి వ్యాధులతో బాధపడుతున్నారని, వాటన్నిటికి సరైన పరిష్కారం నిత్యం యోగా చేయడమేనని సూచించారు.