శంకర్‌గౌడ్ ఆత్మహత్యకు సర్కార్‌దే బాధ్యత
ABN , Publish Date - Apr 25 , 2026 | 06:50 AM
ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు అన్నారు.
బీజేపీ నేతలు రాంచందర్‌రావు, లక్ష్మణ్
హైదరాబాద్/రాంనగర్/నర్సంపేట, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు అన్నారు. ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ బకాయిలు చెల్లించకపోవడం, రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన బెనిఫిట్స్ ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమే అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకూ కార్మికుల పోరాటానికి బీజేపీ అండగా నిలుస్తుందని చెప్పారు. శంకర్‌గౌడ్‌ది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్యే అని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. నాడు కేసీఆర్ ప్రభుత్వం నిర్బంధం చేస్తే, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అహంకారం ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం శవ రాజకీయాలు చేస్తోందని, ఆర్టీసీ కార్మికులు రాష్ట్రప్రభుత్వానికి దొంగల్లా కనపడుతున్నారా..? అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆయన మాట్లాడారు. శంకర్‌గౌడ్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని బస్ డిపోకు తరలించబోతే పోలీసులు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.