బండి సంజయ్ తప్పు చేయలేదు
ABN , Publish Date - May 19 , 2026 | 04:41 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకుని బీఆర్‌ఎస్ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు మండిపడ్డారు.
ఉద్దేశపూర్వకంగానే బీఆర్‌ఎస్ దుష్ప్రచారం.. కవిత జైలుకెళ్తే కేటీఆర్ రాజీనామా చేశారా?
‘కాళేశ్వరం’ కేసులో హైకోర్టుకు ఎందుకెళ్లారు?
కాంగ్రెస్‌కు దమ్ముంటే ఫార్ములా ఈ, కాళేశ్వరం కేసుల్లో బాధ్యులను అరెస్టు చేయాలి: రాంచందర్‌రావు
హైదరాబాద్, మే 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకుని బీఆర్‌ఎస్ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు మండిపడ్డారు. సంజయ్ ఏ తప్పూ చేయలేదని, ఒక వేళ ఆయన తప్పు చేసి ఉంటే తాను బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. సంజయ్ కుమారుడు తప్పు చేస్తే.. మంత్రి పదవికి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సొంత చెల్లెలు కవిత మద్యం కేసులో జైలుకెళ్తే.. కేటీఆర్‌గానీ, తండిగా కేసీఆర్‌గానీ రాజీనామా చేశారా? అని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మోర్చాల సమావేశంలో రాంచందర్‌రావు మాట్లాడారు. అనుకూల మీడియా, సోషల్ మీడియా ద్వారా సంజయ్‌ను, బీజేపీని బద్నాం చేసేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ‘సంజయ్ కుటుంబ సభ్యులు తప్పు చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు ఉండాల్సిందే. అది న్యాయస్థానం చూసుకుంటుంది. ఒక వ్యక్తిపై కేసు నమోదు చేస్తే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడం న్యాయపరమైన అంశం. ముందస్తు బెయిల్ రాకపోవడంతో సంజయ్ కుమారుడు సరెండర్ అయ్యాడు.. ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే మీకేంటి బాధ?’ అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. నేషనల్ క్రైం బ్యూరో రికార్డుల ప్రకారం, బీఆర్‌ఎస్ హయాంలో పదేళ్లలో మహిళలపై అత్యాచారాలు 67శాతం పెరిగాయని ఆరోపించారు. ‘మీ హయాంలో జరిగిన జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై అత్యాచారం కేసు ఏమైంది? కొమ్రంభీం జిల్లాలో ఒక యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు ఏమైంది? డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు కారణమెవరు? మీ పార్టీ ఎమ్మెల్యే లైంగిక వేధింపులపై మహిళా సర్పంచ్ ఫిర్యాదు చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు? గిరిజన యువతి లక్ష్మి పోలీసు కస్టడీలో చనిపోతే ఏం చర్యలు తీసుకున్నారు? మీ పార్టీ కార్పొరేటర్ ఒకరు అత్యాచారం కేసులో ఉన్నాడు.. దీనికి ఏం సమాధానం చెబుతారు? ఇంటర్ ఫలితాల్లో తప్పుల కారణంగా 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి మీరు కారణం కాదా?’’ అని కేటీఆర్‌ను నిలదీశారు. బండి భగీరథ్ కేసులో మైనర్ బాలిక కుటుంబాన్ని కూడా బీఆర్‌ఎస్ రోడ్డుపైకి ఈడుస్తోందని మండిపడ్డారు. బీజేపీతో పోరాడలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే ఫార్ములా ఈ-కార్ రేసు, కాళేశ్వరం కేసుల్లో బాధ్యులను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. ‘బీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడిందని మీకు ప్రజలు ఓట్లేశారు. మీరు చేయాల్సిన పనిని మాతో చేయించాలని చూస్తే ఎలా?’ అని కాంగ్రెస్‌ను నిలదీశారు. ఒకటి, రెండు బ్యారేజీలే కాకుండా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు కోరాలని డిమాండ్ చేశారు.