Share News

పెట్రోలు, డీజిల్‌పై తక్షణం వ్యాట్‌ తగ్గించాలి

ABN , Publish Date - Mar 28 , 2026 | 05:26 AM

సీఎం రేవంత్‌రెడ్డి మాటల గారడీలు పక్కనబెట్టి.. పెట్రోలు, డీజిల్‌పై తక్షణమే వ్యాట్‌ తగ్గించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌. రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు.

పెట్రోలు, డీజిల్‌పై తక్షణం వ్యాట్‌ తగ్గించాలి

  • సీఎం రేవంత్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్‌

హైదరాబాద్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి మాటల గారడీలు పక్కనబెట్టి.. పెట్రోలు, డీజిల్‌పై తక్షణమే వ్యాట్‌ తగ్గించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌. రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన పన్ను వాటాను తగ్గిస్తే లీటర్‌ పెట్రోలు రూ. 100 లోపు వచ్చే అవకాశం ఉందని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, సామాన్య, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలే పరమావధిగా కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని భారీగా తగ్గించిందని గుర్తు చేశారు. కేంద్రం పన్నులు తగ్గిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాట్‌ భారం సుమారు 35 శాతం ఉండటం వల్ల సామాన్యుడిపై పెనుభారం పడుతోందని అన్నారు. గత ప్రభుత్వాలు చేసిన అప్పులు, ఆయిల్‌ బాండ్ల భారం ఉన్నా కేంద్రం వెనక్కి తగ్గలేదని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పన్నుల రూపంలో ప్రజల రక్తాన్ని పిండుతోందని మండిపడ్డారు. పెట్రోల్‌ ధరలో కేంద్రం వాటా కంటే రాష్ట్రం వాటాయే ఎక్కువగా ఉండటం దురదృష్టకరమని రాంచందర్‌రావు పేర్కొన్నారు.

Updated Date - Mar 28 , 2026 | 05:26 AM