Share News

అక్బరుద్దీన్‌, రేవంత్‌రెడ్డి ఇద్దరూ దోస్తులే

ABN , Publish Date - Feb 28 , 2026 | 03:53 AM

సీఎం రేవంత్‌రెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌లు ఇద్దరూ దోస్తులే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు విమర్శించారు.

అక్బరుద్దీన్‌, రేవంత్‌రెడ్డి ఇద్దరూ దోస్తులే

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌లు ఇద్దరూ దోస్తులే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు విమర్శించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముస్లిం వ్యతిరేకులు అంటూ అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల దృష్ట్యా, రేవంత్‌ సూచన మేరకు అక్బరుద్దీన్‌ ఈ ప్రకటన చేశారని ఆరోపించారు. ‘అక్బరుద్దీన్‌, రేవంతుద్దీన్‌ ఇద్దరూ దోస్తులు..తోడుదొంగలు.. అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలు ఒక నాటకం.. కాంగ్రెస్‌ పార్టీ ముస్లింల పార్టీ అని జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో రేవంత్‌ ప్రకటించారు. ఎంఐఎం పార్టీ కాంగ్రె్‌సతో అంటకాగుతోందని ప్రజలు గుర్తించారు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈ పరిణామం తమకు నష్టం కలిగిస్తుందని సీఎం భయపడ్డారు.. అందుకే అక్బరుద్దీన్‌తో ఈ ప్రకటన చేయించారు’ అని రాంచందర్‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ, ఎంఐఎంకు కొమ్ముగాస్తోందని ఆరోపించారు. మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేశాయని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా ఆ మూడు పార్టీలు అదే పంథా కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. అందులో భాగంగానే అక్బరుద్దీన్‌ ఈ ప్రకటన చేశారని ఆరోపించారు. ‘హైదరాబాద్‌లో ఆక్రమణల తొలగింపు పేరిట పేదల ఇళ్లు కూల్చివేస్తున్న రేవంత్‌, అక్బరుద్దీన్‌ ఇల్లు గానీ, ఆయన విద్యాసంస్థలను గానీ కూల్చడం లేదు... ఆ విషయంలో ఆయనకు రేవంత్‌ మద్దతు ఉంటుంది.’ అని రాంచందర్‌రావు విమర్శించారు. కాగా, సీఎం రేవంత్‌, హిందూ సమాజంలో నల్లమచ్చ అని ఎంపీ అర్వింద్‌ విమర్శించారు. హిందువుల కులాల పేర్లు ప్రస్తావిస్తూ, వారంతా విషనాగులు అంటూ అక్బరుద్దీన్‌ ఇటీవలి ఆరోపణ చేసినప్పుడు రేవంత్‌ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.

Updated Date - Feb 28 , 2026 | 03:53 AM