జై అల్లావుద్దీన్ అంటే డబ్బులొస్తాయా?
ABN , Publish Date - May 07 , 2026 | 04:47 AM
జై శ్రీరామ్ అంటే డబ్బులు రాకపోతే.. జై అల్లావుద్దీన్ అంటే వస్తాయా అని కాంగ్రెస్ నేతలనుద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్రశ్నించారు.
కొండా సురేఖ రాజీనామా చేయాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు డిమాండ్
హైదరాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): జై శ్రీరామ్ అంటే డబ్బులు రాకపోతే.. జై అల్లావుద్దీన్ అంటే వస్తాయా అని కాంగ్రెస్ నేతలనుద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందూ దేవుళ్లను, దేవతలను కాంగ్రెస్ మంత్రులు అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. సనాతన ధర్మంపై విశ్వాసం లేని వారు దేవాదాయ శాఖ మంత్రిగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. హిందూ దేవుళ్లపై నమ్మకం లేని వారికి పదవిలో కొనసాగే అర్హత లేదని, కొండా సురేఖ తన మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని అవమానించిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులకు ప్రజలు గుణపాఠం చెప్పారని రాంచందర్‌రావు గుర్తు చేశారు.
ప్రభుత్వ అసమర్థత వల్లే రైతుల మరణాలు
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో గాలివాన బీభత్సంతో ధాన్యం కల్లాల వద్ద ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోవడం తన మనసును కలిచివేసిందని రాంచందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశా రు. ఘటనలో చనిపోయిన గుండారపు వెంకటేష్, తనుగుల అభిరాం, లచ్చన్న కుటుంబాలకు ఆయన తన సానుభూతిని తెలియజేస్తూ, ఈ మరణాలకు కాంగ్రెస్ సర్కారు అసమర్థతే కారణమని ఆరోపించారు. కొనుగోళ్లు జరపాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్లే ఈ విషాదం చోటుచేసుకుందని విమర్శించారు. ధాన్యానికి కనీస మద్ధతు ధరతో సహాఅన్నింటికీ ప్రతీ పైసా కేంద్రమే భరిస్తోందని, ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందేంటని ఆయన ప్రశ్నించారు.