Share News

ప్రైవేటు స్కూళ్లు ఎందుకు పెరిగాయ్‌.. రేవంత్‌?

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:43 AM

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లకు అంత డిమాండ్‌ అంటే ప్రైవేటు పాఠశాలలు ఎందుకు పెరుగుతున్నాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు..

ప్రైవేటు స్కూళ్లు ఎందుకు పెరిగాయ్‌.. రేవంత్‌?

  • 90 శాతం ప్రభుత్వ బడులు కూలిపోయే స్థితిలో ఉంటే సీఎం మాటలు విడ్డూరం..

  • ఉస్మానియా యూనివర్సిటీకి ప్రకటించిన రూ.1,000 కోట్లు ఏమయ్యాయి..?: రాంచందర్‌రావు

హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లకు అంత డిమాండ్‌ అంటే ప్రైవేటు పాఠశాలలు ఎందుకు పెరుగుతున్నాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు.. సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ‘నో అడ్మిషన్‌’ బోర్డులు పెట్టాల్సి వచ్చిందని సీఎం గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదమని విమర్శించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేషనలైజేషన్‌ పేరిట స్కూళ్లను తగ్గ్గించి, మూసివేతకు రంగం సిద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 90 శాతానికి పైగా ప్రభుత్వ బడులు కూలిపోయే స్థితిలో ఉన్నాయని, విద్యార్థినులకు టాయిలెట్లు, కనీస మౌలిక వసతులు లేవని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీకి ప్రకటించిన రూ.వెయ్యి కోట్లు ఏమయ్యాయని సీఎంను నిలదీశారు. ఓయూలో ‘బీ’ హాస్టల్‌ ఇప్పటికే మూతపడగా, ‘డీ’, ‘ఈ’ హాస్టళ్లు కూడా కూలిపోయే స్థితికి చేరాయన్నారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల హాస్టళ్లను తక్షణమే పునర్నిర్మించాలని రాంచందర్‌ రావు డిమాండ్‌ చేశారు. తమ హక్కుల కోసం టీచర్లు, ప్రొఫెసర్లు మాట్లాడితే సస్పెండ్‌ చేస్తున్నారని దుయ్యబట్టారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని.. అయితే, నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సింగరేణిలో బొగ్గు కుంభకోణాన్ని కప్పిపుచ్చుకునేందుకే సీఎం రేవంత్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి టార్గెట్‌ చేసి ఆరోపణలు గుప్పిస్తున్నారన్నారు. ‘సింగరేణిలో 45 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు కుంభకోణాన్ని దాచిపెట్టడంతో పాటు ఈ అవినీతిపై నిజాలు బయటకు రాకుండా అణిచివేయడానికే సీఎం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తప్పు చేయనప్పుడు బీజేపీ నిజ నిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారు?’ అని నిలదీశారు. ఈ బొగ్గు దొంగతనం వెనుక ఉన్న అసలు దొంగలెవరో సమాధానం చెప్పాలని రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. కాగా, పారిశ్రామికవేత్త ఫణికుమార్‌ రాంచందర్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు.

Updated Date - Jun 21 , 2026 | 04:43 AM