Share News

రాహుల్‌కు రాష్ట్రంలో పర్యటించే హక్కులేదు

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:17 AM

రాహుల్‌గాంధీకి తెలంగాణాలో పర్యటించే నైతిక హక్కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం ధర్నాచౌక్‌ వద్ద ఉద్యోగ...

రాహుల్‌కు రాష్ట్రంలో పర్యటించే హక్కులేదు

  • రాష్ట్రంలో ‘గడ్డపార రాజ్యం’ నడుస్తోంది: రాంచందర్‌రావు

హైదరాబాద్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): రాహుల్‌గాంధీకి తెలంగాణాలో పర్యటించే నైతిక హక్కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం ధర్నాచౌక్‌ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్‌ బకాయిల కోసం పార్టీ నిర్వహించిన నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిక్లరేషన్‌ల పేరిట ప్రకటనలు చేసి బీసీలను, రైతులను కాంగ్రెస్‌ మోసం చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా.. రాహుల్‌ గాంధీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వచ్చారని నిలదీశారు. ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వడానికి డబ్బుల్లేవుగానీ, నేషనల్‌ హెరాల్డ్‌ సంస్థకు కోట్లాది రూపాయలు ఇవ్వడానికి మాత్రం నిధులు ఉన్నాయా? అంటూ సీఎంపై మండిపడ్డారు. రిటైర్డ్‌ ఉద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో 40శాతం కమీషన్ల పాలన సాగుతోందని రాంచందర్‌రావు ఆరోపించారు. రెండున్నరేళ్లలో ఎంతమంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమచేశారో స్పష్టం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ‘రేవంత్‌ సీఎం అయ్యాక గడ్డపార పట్టుకోగా, మంత్రులు పారలు పట్టుకున్నారు’ అని అన్నారు. రాష్ట్రంలో గడ్డపార రాజ్యం సాగుతోందని, పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూలుస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఒక్క రూపాయి కూడా రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వలేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ బకాయిలు సకాలంలో చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు.

Updated Date - Mar 03 , 2026 | 03:17 AM