మహిళా బిల్లుపై సీఎం ద్వంద్వ ప్రమాణాలు
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:22 AM
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు విషయమై సీఎం రేవంత్ రెడ్డి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ తీవ్రంగా విమర్శించారు.
డీలిమిటేషన్‌పై రేవంత్ రెడ్డికి అవగాహన లేదు: లక్ష్మణ్
హైదరాబాద్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు విషయమై సీఎం రేవంత్ రెడ్డి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ తీవ్రంగా విమర్శించారు. రాజకీయ లబ్థి కోసమే ఈ చారిత్రక బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీది దొంగనీతి అని సోమవారం లక్ష్మణ్ మీడియాకు చెప్పారు. గత 30 ఏళ్లుగా ఏదో ఒక సాకుతో మహిళా బిల్లును అడ్డుకుంటున్నది కాంగ్రెస్ పార్టేనన్నారు. యూపీఏ చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ కూటమి పార్టీల పేరు చెప్పి వెనక్కి తగ్గారే తప్ప, మహిళా సాధికారతపై, మహిళా రిజర్వేషన్ల అమలుపై ఎప్పుడూ చిత్తశుద్థి లేదని ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్లతోపాటు, నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. డీ లిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలను నష్టం జరుగుతుందని అనవసర భయాందోళనలు కల్పిస్తూ.. ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ‘దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం 130 స్థానాలు ఉంటే 24శాతం తో డిలిమిటేషన్ తర్వాత ఎంపీ సీట్లు 816కి పెరిగితే, దక్షిణాది రాష్ర్టాల్లో సీట్ల సంఖ్య 195 అవుతాయి. అదే 24 శాతం నిష్పత్తి కొనసాగుతుంది ’ అని లక్ష్మణ్ వివరించారు.