Share News

సీఎం రేవంత్‌ తప్పుదారి పట్టిస్తున్నారు

ABN , Publish Date - Apr 16 , 2026 | 03:57 AM

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, అసలు ఈ ప్రక్రియపై ఆయనకు అవగాహన...

సీఎం రేవంత్‌ తప్పుదారి పట్టిస్తున్నారు

  • రాజ్యాంగబద్ధంగానే పునర్విభజన ప్రక్రియ

  • బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్ర జ్యోతి): దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, అసలు ఈ ప్రక్రియపై ఆయనకు అవగాహన లేదని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. డీలిమిటేషన్‌ అనేది ఆర్టికల్‌ 82, 170 ప్రకారం ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కల ఆధారంగా చేపట్టే ప్రక్రియ అని వివరించారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీలిమిటేషన్‌ చేపట్టేందుకు భారత ఎన్నికల సంఘంతో కేంద్ర ప్రభుత్వం సంప్రదించి.. కమిషన్‌ను నియమిస్తుందని తెలిపారు. ఇదంతా రాజ్యాంగబద్ధంగా జరుగుతుందన్నారు. 1962లో ఉమ్మడి ఏపీలో 43 స్థానాలు ఉండగా, 1972లో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన డీలిమిటేషన్‌ వల్ల ఒక స్థానం తగ్గి 42కు చేరాయన్నారు. గతంలో కాంగ్రెస్‌ చేసిన పునర్విభజన వల్లనే తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 50శాతానికి పైగా సీట్లు పెంచి పార్లమెంట్‌ స్థానాలను 850కి చేర్చడం ద్వారా సామాజిక న్యాయం చేసేందుకు కృషి చేస్తోందన్నారు. రేవంత్‌ రెడ్డి ప్రతిపాదిస్తున్న హైబ్రిడ్‌ పాలసీ, జీఎస్‌‌డీపీలకు రాజ్యాంగబద్ధత లేదన్నారు. జీఎస్‌‌డీపీ అంటే గాంధీస్‌ డీలిమిటేషన్‌ ప్రొసీజర్‌ అని వ్యాఖ్యానించారు. బీజేపీ నమూనా వల్లనే దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రస్తుతం దక్షిణాదిలోని 129 ఎంపీ స్థానాలు 198కి పెరుగుతాయన్నారు. సీటు కాపాడుకునేందుకు రేవంత్‌ చేసే ఆర్‌.టి.జీ.ఎస్‌(రేవంత్‌ టు గాంధీ సెటిల్మెంట్‌) రాజకీయం బీజేపీలో ఉండదన్నారు. డీలిమిటేషన్‌పై ఏ వేదిక మీదైనా చర్చకు సిద్ధమని అన్నారు.

Updated Date - Apr 16 , 2026 | 03:57 AM