స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తాం: బండి సంజయ్
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:29 AM
పార్టీ ఫిరాయింపు అంశంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్‌ను శాసనసభ స్పీకర్ డిస్మిస్ చేయడం దారుణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
హైదరాబాద్, మార్చి 11(ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయింపు అంశంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్‌ను శాసనసభ స్పీకర్ డిస్మిస్ చేయడం దారుణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శాసనవ్యవస్థే ఫిరాయింపులను ప్రోత్సహించేలా తీర్పు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా పోటీ చేసినా అనర్హతవేటు వర్తించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కన్నతల్లే బిడ్డను చంపడం ఎంత పాపమో... శాసన వ్యవ స్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంతకంటే పాపమన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేసినా పార్టీ ఫిరాయించలేదని చెప్పడం హాస్యాస్పదమని చెప్పారు. గాంధీభవన్‌లో సంసారం చేస్తూ...కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నా ఫిరాయింపులు వర్తించకపోవడం ప్రజాస్వామ్యానికే చేటని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డే ఆయా నేతలకు స్వయంగా కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించేలా.. శాసన వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయేలా స్పీకర్ తీర్పు ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులపై చెంప చెళ్లుమనే లా న్యాయవ్యవస్థ తీర్పు ఇస్తుందనే నమ్మకముందని ఆశాభావం వ్యక్తం చేశారు.