రాజ్యసభ అభ్యర్థులపై బీజేపీ కసరత్తు
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:28 AM
ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి....
ప్రధాని నివాసంలో సీఈసీ సుదీర్ఘ చర్చ
న్యూఢిల్లీ, మే 31 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి ఆదివారం సాయంత్రం సేవాతీర్థ్‌లో సుదీర్ఘంగా కసరత్తు నిర్వహించారు. ఈ భేటీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్, సీనియర్ నేత కె.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాల వారీగా పార్టీ అభ్యర్థుల విజయవకాశాలు, రాజకీయ సమీకరణాలపై మోదీ, అమిత్‌షా ఆరా తీశారు. మొత్తం 24 స్థానాల్లో 11సీట్లలో బీజేపీ నేరుగా అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్డీయే మిత్రపక్షాల అభ్యర్థులు ఆరు స్థానాల్లో పోటీ చేయనున్నారు. ఏపీ, గుజరాత్, కర్ణాటకల్లో 4స్థానాల చొప్పున.. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో చెరో మూడు స్థానాలకు, జార్ఖండ్‌లో రెండు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాంలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్లు దాఖలు చేయడానికి జూన్ 8 ఆఖరి గడువు. జూన్ 18న పోలింగ్ జరుగనుంది.
నేడు సీనియర్ నేతలతో సమావేశం..
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టనున్న కార్యక్రమాల సన్నాహాలపై సమీక్షించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ సోమవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీకి జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హాజరుకానున్నారు. బీజేపీ కొత్త కార్యవర్గాన్ని నబీన్ జూన్‌లోనే ప్రకటించాల్సి ఉంది.