సత్తా చాటిన సంజయ్
ABN , Publish Date - Feb 14 , 2026 | 04:00 AM
పురపోరులో కమలం బలపడింది. గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించింది. చరిత్రలో తొలిసారి కరీంనగర్ కార్పొరేషన్‌లో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టిస్తామని ప్రకటించిన.....
గతంతో పోలిస్తే బీజేపీకి పెరిగిన సీట్లు.. కరీంనగర్ కార్పొరేషన్‌లో మెజారిటీకి కాస్త దూరంలో!
పాలమూరు మినహా మిగతాచోట్ల కారు కంటే ఎక్కువ స్థానాలు
మునిసిపాలిటీల్లో మాత్రం అంతగా రాణించని కమలనాథులు
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): పురపోరులో కమలం బలపడింది. గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించింది. చరిత్రలో తొలిసారి కరీంనగర్ కార్పొరేషన్‌లో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టిస్తామని ప్రకటించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సత్తా చాటారు. గతంలో ఇక్కడ 13 స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి 30స్థానాలు కైవసం చేసుకుంది. ఈ కార్పొరేషన్‌లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులుదక్కించుకోవాలంటే 34 స్థానాలు కావాల్సి ఉండగా.. ఇప్పటికే అక్కడ ఇండిపెండెంట్‌గా గెలిచిన తెల్ల లక్ష్మి, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున గెలిచిన సాయిజ్యోతి.. సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అలాగే ఈ ఎన్నికల్లో.. మహబూబ్‌నగర్ మినహా మిగతా ఆరు కార్పొరేషన్లలో కమలనాథులు బీఆర్‌ఎస్ కంటే ఎక్కువ స్థానాలు సాధించడం గమనార్హం. ఆ ఆరు కార్పోరేషన్‌లలో 354 డివిజన్లకుగాను.. బీజేపీ 69 స్థానాలు సాధించగా, బీఆర్‌ఎస్ 48 డివిజన్లకే పరిమితమయ్యింది. కాగా.. పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలున్నా మునిసిపాలిటీల్లో మాత్రం ఆ స్థాయిలో ఫలితాలను సాధించలేకపోయింది. గతంతో పోలిస్తే మునిసిపాలిటీల్లోనూ ఓట్లు, సీట్లు పెంచుకున్నప్పటికీ.. చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునే స్థాయిలో రాణించలేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఉత్తర తెలంగాణలో ఒక్క కరీంనగర్ కార్పొరేషన్‌లో తప్ప, మిగతా మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ఆశించిన మేర స్థానాలు కమలం దక్కించుకోలేదు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రాల్లో గతంతో పోలిస్తే సీట్లు పెంచుకున్నా, చైర్మన్ పీఠానికి చేరువకాలేకపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలున్నా అందుకు తగ్గట్టుగా మునిసిపాలిటీల్లో ఫలితాలను సాధించలేకపోయింది. దక్షిణ తెలంగాణాలో పలు మునిసిపాలిటీల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. రాష్ట్రవ్యాప్తంగా 43 మునిసిపాలిటీల్లో కనీసం ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే.. గత ఎన్నికల్లో 239 వార్డుల్లో గెలుపొందిన బీజేపీ, ఈసారి సుమారు 350 వార్డుల్లో విజయం సాధించడం గమనార్హం. అప్పట్లో తాము 13 శాతం ఓట్లు సాధించగా, ఈసారి 20శాతానికిపైగా సాధించామని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అలాగే.. ఇంతకుముందు ఆమన్‌గల్, మక్తల్ మునిసిపాలిటీలను కైవసం చేసుకున్న పార్టీ.. ఈసారి మెజారిటీ స్థానాలు దక్కిన నారాయణపేట, ఆదిలాబాద్, మెట్‌పల్లి, రాయికల్ చైర్మన్ పదవులను కైవసం చేసుకోవడంపై దృష్టి సారించింది.
బీజేపీ ఎమ్మెల్యేలున్నా..
పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న మునిసిపాలిటీల్లో ఒక్క ఆదిలాబాద్ మాత్రమే మెరుగైన ఫలితాన్ని సాధించింది. కామారెడ్డి ఎమ్మెల్యే కె.వెంకటరమణారెడ్డి, స్థానికంగా తన పట్టు నిలుపుకొనే ప్రయత్నం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించి ఆయన రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ మునిసిపాలిటీలో 49 వార్డులకుగాను 18 చోట్ల బీజేపీ విజయం సాధించింది. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్‌లో 42 వార్డులకుగాను బీజేపీ 13 స్థానాలకే పరిమితమైంది. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో ఆధిపత్యం సాధించిన ఆయన, నిర్మల్ మునిసిపాలిటీలో హవా కొనసాగించలేకపోయారు. బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సత్తాచాటారు. అక్కడ 49 వార్డులకుగాను బీజేపీ 21 స్థానాలు సాధించింది. ఎక్స్ ఆషిషియో (ఎంపీ, ఎమ్మెల్యే) సభ్యులతో కలిపి ఆ పార్టీకి అక్కడ 23 మంది ఉన్నారు. మరో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు బీజేపీకి మద్ధతు ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్మూరు మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను, ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ 8 స్థానాలు సాధించింది. ముథోల్ ఎమ్మెల్యే రామారావు పవార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ముథోల్ సెగ్మెంటులో కీలకమైన భైంసా మునిసిపాలిటీలో బీజేపీ పట్టు సాధించలేకపోయింది. పాల్వాయి హరీశ్ ప్రాతినిఽధ్యం వహిస్తున్న సిర్‌పూర్‌లో కమలం 5 స్థానాలు సాధించింది. సూర్యనారాయణగుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ లో పార్టీ పట్టు నిలుపుకొంది.
ఎక్కడెక్కడ ఎలాగంటే..
ఎంపీ ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ కార్పొరేషన్‌ను గెలిపించుకునేందుకు గట్టి పోరాటం చేశారు. కానీ, అక్కడ పార్టీ కిందటిసారిలాగే 28 డివిజన్లకే పరిమితమైంది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లకుగాను, బీజేపీ సింగిల్ డిజిట్ సాధించగా.. ఆ పార్లమెంటు పరిధిలోని మునిసిపాలిటీల్లో 25 మంది బీజేపీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. ఎంపీ ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్‌గిరి పార్లమెంటు సెగ్మెంటులో అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట మునిసిపాలిటీలున్నాయి. ఈ మూడు మునిసిపాలిటీల్లో 68 వార్డులుండగా..8స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మెదక్ పార్లమెంటు పరిధిలోని 13 మునిసిపాలిటీల్లో 24 మంది బీజేపీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు పరిధిలో 6 మునిసిపాలిటీలు ఉండగా, ఒక్క ఆదిలాబాద్‌లో మాత్రమే చెప్పుకోదగ్గ సీట్లు వచ్చాయి. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఆరు మునిసిపాలిటీలు ఉండగా.. ఒక్కదాంట్లో కూడా బీజేపీ చెప్పుకోదగ్గ ఫలితం సాధించలేదు. అన్నిచోట్లా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యింది.