మునిసిపల్ ఎన్నికల్లో బలపడ్డాం
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:56 AM
మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ బలపడిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించిందని చెప్పారు.
రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీలు మావే
హంగ్ ఉంటే.. ఎవరికీ మద్దతివ్వం: రాంచందర్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ బలపడిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించిందని చెప్పారు. మజ్లిస్ కారణంగానే పలు మునిసిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలు విజయం సాధించాయన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘అర్బన్ నక్సలైట్లు, కమ్యూనిస్టులు, ఎంఐఎం కలిసి బీజేపీని ఓడించే ప్రయత్నం చేశాయి. బీజేపీ గెలుపును అడ్డుకోవడమే లక్ష్యంగా.. రెండో స్థానంలో కాంగ్రెస్ లేదా బీఆర్‌ఎస్ ఏది ఉంటే ఆ పార్టీకి ఓటు వేయాలని అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు పిలుపునిచ్చారు. మజ్లిస్ మద్దతు లేకుంటే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ గెలవలేవు. మేం చాలా చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాం. 250కు పైగా వార్డుల్లో బీజేపీ విజయం సాధించి 6 మునిసిపాలిటీల్లో ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది. తొలిసారిగా నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లను కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. వేములవాడ, రాయికల్, నారాయణపేట్, ఆదిలాబాద్, మెట్‌పల్లి బీజేపీ ఖాతాలో చేరబోతున్నాయి. త్రిముఖ పోటీ వల్ల కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి కొంత నష్టం జరిగింది. గతంలో ప్రాతినిధ్యం లేని జిల్లాల్లో కూడా ఈసారి మా పార్టీ ఖాతా తెరిచింది. ఇది కాంగ్రెస్ చెప్పుకునేంత గొప్ప విజయమేం కాదు. సాధించిన విజయాలు కూడా అధికార దుర్వినియోగం, పోలీసుల దౌర్జన్యాలతోనే. హంగ్ వచ్చిన చోట ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వబోం’’ అని రాంచందర్‌రావు పేర్కొన్నారు.