కరీంనగర్‌లో హంగ్
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:58 AM
ఉత్తర తెలంగాణ రాజకీయాలకు కీలక కేంద్రంగా ఉంటున్న కరీంనగర్ కార్పొరేషన్‌లో.. తొలిసారి బీజేపీ 30 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
మ్యాజిక్‌ఫిగర్‌పై బీజేపీ నజర్
పార్టీలోకి ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులు
నలుగురు టచ్‌లో ఉన్నట్టు ప్రచారం
కాషాయపార్టీకే అధికారం దక్కే చాన్స్
కరీంనగర్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉత్తర తెలంగాణ రాజకీయాలకు కీలక కేంద్రంగా ఉంటున్న కరీంనగర్ కార్పొరేషన్‌లో.. తొలిసారి బీజేపీ 30 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత ఎన్నికల్లో ఈ కార్పొరేషన్‌ను దక్కించుకున్న బీఆర్‌ఎస్ ఈసారి 9 డివిజన్లలో మాత్రమే గెలవగా.. కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలను దక్కించుకుంది. ఎంఐఎం మూడు డివిజన్లలో, ఫార్వర్డ్‌బ్లాక్ రెండు డివిజన్లలో గెలవగా.. ఇండిపెండెంట్లు 8 డివిజన్లలో విజయం సాధించారు. 66 స్థానాలున్న కరీంనగర్ కార్పొరేషన్‌లో ఏ పార్టీ అయినా జెండా ఎగరేయాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్.. 34. అయితే.. కేంద్రమంత్రి బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. ఈ సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే మ్యాజిక్ ఫిగర్ 35 అవుతుంది. బీజేపీకి వచ్చిన స్థానాలు 30 కాగా.. 15వ డివిజన్ నుంచి గెలుపొందిన ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి విపుల సాయిజ్యోతి, 13వ డివిజన్‌లో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి తేళ్ల లక్ష్మి ఇప్పటికే బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. దీనితో ఆ పార్టీ బలం 32కు పెరిగింది. కేంద్ర మంత్రి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉండడంతో మరో ఇద్దరు సభ్యులు ఆ పార్టీలో చేరితే మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకుని అధికారం చేపట్డడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో.. స్వతంత్రులుగా గెలుపొందిన తమ పార్టీ రెబెల్స్ ముగ్గురిని బుజ్జగించేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. ఇండిపెండెంట్లలో నలుగురు ఇప్పటికే బండి సంజయ్‌ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ నలుగురు.. లేదా వారిలో ఇద్దరు బీజేపీలో చేరినా అధికారం చేపట్డడానికి మార్గం సుగమమవుతుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ కార్పొరేషన్‌ను దక్కించుకోవడానికి బీజేపీ తమ ఇద్దరు ఎమ్మెల్సీ (పట్టభద్రుల ఎంఎల్‌సీ అంజిరెడ్డి, ఉపాధ్యాయుల ఎంఎల్‌సీ మల్క కొమరయ్య)ను కూడా కరీంనగర్‌లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేయించే అవకాశం ఉంది. ఎలాచూసినా ఈ కార్పొరేషన్‌లో అధికారం చేపట్టేందుకు బీజేపీకే ఎక్కువ అవకాశాలున్నాయి. కాంగ్రెస్ ఒకవేళ ఈ కార్పొరేషన్‌ను దక్కించుకోవాలనుకుంటే.. బీఆర్‌ఎస్, ఫార్వర్డ్‌బ్లాక్, ఎంఐఎం, ఇండిపెండెంట్లందరూ ఆ పార్టీకి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పటికే ఒక ఫార్వర్డ్ బ్లాక్, ఒక ఇండిపెండెంట్, బీజేపీలో చేరగా, మరికొందరు శనివారం చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రె్‌సకు అవకాశాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ.. చివరిదాకా ప్రయత్నం చేయకుండా కాంగ్రెస్ వదిలేస్తుందా? అనే సందేహాలు సైతం ఉన్నాయి.