ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
ABN , Publish Date - May 03 , 2026 | 04:35 AM
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు డిమాండ్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలాగే కాంగ్రెస్ కూడా ఆర్టీసీ....
బీఆర్‌ఎస్‌లా కాంగ్రెస్ కూడా ఆర్టీసీకి మోసం
రేవంత్ ప్రభుత్వం అన్నింటా వైఫల్యం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
రామాయంపేట, మే 2(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు డిమాండ్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలాగే కాంగ్రెస్ కూడా ఆర్టీసీ ఉద్యోగులను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై హైకోర్టు మొట్టికాయలు వేసే పరిస్థితి వచ్చిందని, టీచర్ల వేతనాలు సమయానికి వేయడం లేదని, రేవంత్ ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవలి అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగానికి నష్ట పరిహారం ఎందుకు ఇవ్వరని రామచందర్‌రావు ప్రశ్నించారు. ఈ నెల 10న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా రూ.8వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని ఆయన తెలిపారు. సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, తదితరులు పాల్గొన్నారు.