బీఆర్‌ఎస్, కాంగ్రెస్.. సింగరేణి కార్మికుల రక్తాన్ని పీల్చాయి
ABN , Publish Date - Jan 21 , 2026 | 05:44 AM
సింగరేణిలో కమీషన్లు, కాంట్రాక్టుల కోసం గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు.. ఆ సంస్థ కార్మికుల రక్తాన్ని పీల్చి, వారి జీవితాలతో ఆడుకున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు.
సింగరేణి, నైని గనుల వ్యవహారంపై దర్యాప్తు జరగాలి: రాంచందర్‌రావు
న్యూఢిల్లీ, జనవరి 20(ఆంధ్రజ్యోతి): సింగరేణిలో కమీషన్లు, కాంట్రాక్టుల కోసం గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు.. ఆ సంస్థ కార్మికుల రక్తాన్ని పీల్చి, వారి జీవితాలతో ఆడుకున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు. సింగరేణి, నైని గనుల బొగ్గు టెండర్లలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేసిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం ఇక్కడ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీ నేతలతో కలిసి మాట్లాడారు. నైని గనుల వ్యవహారంలో సగం పాపం బీఆర్‌ఎస్, మరో సగం కాంగ్రె్‌సదని ఆయన ఆరోపించారు. నేటి సింగరేణి పరిస్థితికి, నైని బొగ్గు గనుల అవకతవకలకు కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్‌ఎస్ కూడా బాధ్యత వహించాల్సిందేనన్నారు. సింగరేణి, నైని బొగ్గు గనుల టెండర్ల రద్దు వ్యవహారం కాంగ్రెస్ చేస్తున్న దోపిడీ పాలనకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు, వారి సొంత మనుషులు, బంధుమిత్రులకే బొగ్గు గనులు, కాంట్రాక్టులు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. గత బీఆర్‌ఎస్ హయాంలో కూడా సింగరేణి కాంట్రాక్టులు వారి సొంత మనుషులకే ఇచ్చారని ఆరోపించారు. నైని బొగ్గు టెండర్లను ఎందుకు రద్దు చేశారో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజలకు స్పష్టత ఇవ్వాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. అంతకుముందు బీఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన టెండర్లు ఎందుకు రద్దు చేశారనేదానిపైనా సమగ్ర విచారణ జరపాల్సిందేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను పూర్తిగా పక్కన పెట్టిందని, రాష్ట్రంలో నిజంగా పాలన జరుగుతోందా, లేక మంత్రుల మధ్య ఎవరు ఎంత పంచుకుంటున్నారు, ఎవరు ఎక్కువ తీసుకున్నారు, ఎవరి కుటుంబానికి ఎంత దక్కింది అన్న గొడవలే కొనసాగుతున్నాయా అనే సందేహం ప్రజల్లో తీవ్రంగా నెలకొందని అన్నారు. సింగరేణిలో గత బీఆర్‌ఎస్ సర్కార్ కూడా అవకతవకలకు పాల్పడిందని, ఒకవేళ హరీశ్ రావు సీబీఐ దర్యాప్తు జరగాలని కోరుకుంటే, ఆ దర్యాప్తు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో జరిగిన అన్ని వ్యవహారాలపైనా జరగాల్సిందేనని స్పష్ట ంచేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు పార్టీలూ పాపాలు చేశాయన్నారు. ఇది టీవీ చానళ్ల మధ్య గొడవ కాదని.. ముఖ్యమంత్రి, మంత్రి మధ్య, ఇద్దరు మంత్రుల మధ్య గొడవ అని రాంచందర్‌రావు అన్నారు. తుపాకీ పెట్టి కార్పొరేట్ కంపెనీలను బెదిరించడం, పేపర్లలో వార్తలు రాగానే టెండర్లు క్యాన్సిల్ చేయడం.. ఇవన్నీ కాంగ్రెస్ పాలనలో పారదర్శకత లేనదనడానికి నిదర్శనాలని అన్నారు.