Alleti Maheshwar Reddy: బీఆర్‌ఎస్ హయాంలో చేసిన భూకేటాయింపులపై విచారణ జరపాలి
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:56 AM
బీఆర్‌ఎస్ హయాంలో చేసిన భూ కేటాయింపులపై సమగ్ర విచారణ చేయించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
లోపభూయిష్ట ‘హిల్ట్’ జీవోను రద్దు చేయాలి: ఏలేటి
హైదరాబాద్, జనవరి 6(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ హయాంలో చేసిన భూ కేటాయింపులపై సమగ్ర విచారణ చేయించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమంగా కేటాయించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, అవినీతికి పాల్పడిన వారిని శిక్షించాలని కోరారు. లోపభూయిష్టంగా ఉన్న హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పు (హిల్ట్) జీవోను రద్దు చేయాలని కోరారు. హిల్ట్, విజన్-2047 డాక్యుమెంట్‌పై మహేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. 22 పారిశ్రామిక జోన్లను కొల్లగొట్టే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆరోపించారు. లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, పర్యావరణ మదింపు, ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే జీవో ఎలా ఇచ్చారని అసెంబ్లీలో నిలదీశారు. ఐడీఎల్ బొల్లారం చాలా కాలుష్య కారకప్రాంతమని, దానిని హిల్ట్‌లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. 100 పరిశ్రమలు రెడ్ జోన్‌లో ఉన్నాయన్నారు. కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్‌ఆర్ వెలుపలికి తరలించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఐదేళ్లలో 43,462 జీవోలు దాచిపెట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో 19,064 జీవోలు తెస్తే... కేవలం 3,290 జీవోలు మాత్రమే ప్రజలకు అందుబాటులో పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయని, మిగతావాటిని దాచిపెట్టిందని విమర్శించారు. బీజేపీ ఎప్పుడూ బీఆర్‌ఎ్‌సతో స్నేహం చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయబోదని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి సంసారం చేస్తే తమకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు.