MP R. Krishnaiah: 42శాతం బీసీ రిజర్వేషన్లు కాదంటే అగ్నిగుండమే
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:57 AM
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే మునిసిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని, లేకుంటే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని బీసీ జేఏసీ చైర్మన్....
బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య
బర్కత్‌పుర, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే మునిసిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని, లేకుంటే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. దీనిపై హైకోర్టు తీర్పు రాకముందే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. త్వరలో మునిసిపల్ ఎన్నికలు నిర్వహిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనను నిరసిస్తూ ఈ నెల 20 నుంచి ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్-బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన 14 బీసీ సంఘాల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. బీసీలను దగా చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం మునిసిపల్ ఎన్నికలకు వెళ్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో 121 మునిసిపాలిటీల్లో బీసీలకు 38 కేటాయించి దగా చేశారని, జనాభా ప్రకారం 68 మునిసిపాలిటీలు కేటాయించాలన్నారు. 10 నగర పాలక సంస్థల్లో బీసీలకు మూడింటిని మాత్రమే కేటాయించినా విపక్ష పార్టీలు నోరు మెదపకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు బలంగా ఉందని, సర్కారు బలమైన వాదనలు వినిపించకపోతే రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని ఆయన హెచ్చరించారు.