ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
ABN , Publish Date - May 31 , 2026 | 06:14 AM
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
తిమ్మాపూర్, మే 30 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోయారని, కలెక్టర్లను క్షేత్రస్థాయికి పంపి నష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటించిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్లతో చేసుకున్న ఒప్పందంతో రైతులను బలవంతంగా తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకునేలా చేసిందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రుల మాటలకు పొంతన లేదని విమర్శించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెబుతుంటే మరో మంత్రి 40, 50 లక్షల మెట్రిక్ టన్నులు అంటున్నారని చెప్పారు. కేంద్రమే మొత్తం ధాన్యం కొనాలని వారు అంటున్నారని, ప్రొసీజర్ ప్రకారం రాష్ట్రం ఎంతైతే ధాన్యం కొనుగోలు చేస్తుందో ఇండెంట్‌ను కేంద్రానికి ముందు పంపించాలన్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొన్న ధాన్యానికి, దబ్బనానికి, సుతిలికి కేంద్రం రీయింబర్స్‌మెంట్ చేస్తుందని చెప్పారు. మార్చి 23 నుంచి కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఉండగా ఏప్రిల్ 25 నుంచి మొదలు పెట్టిందన్నారు. ఇప్పటికైనా రెండు రోజుల్లో కొనుగోళ్లను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.