ఇవ్వాళ రేవంతుద్దీన్.. రేపు రెహమాన్ డెకైత్!
ABN , Publish Date - Feb 06 , 2026 | 03:47 AM
రేవంత్‌రెడ్డి రేవంతుద్దీన్‌గా మారారని.. రానున్న రోజుల్లో ఆయన దురంధర్ సినిమాలో చూపిన రెహమాన్ డెకైత్ అవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు చెప్పారు.
మజ్లిస్ కనుసన్నల్లో నడుస్తున్న సీఎం రేవంత్
తెలంగాణను అప్పులకుప్పగా మార్చిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్
123 మునిసిపాలిటీల్లో రూ.3600 కోట్ల అప్పులు
అవినీతి, కమీషన్లు, బుజ్జగింపులు.. ఇదే కాంగ్రెస్ పాలన
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రేవంత్‌రెడ్డి రేవంతుద్దీన్‌గా మారారని.. రానున్న రోజుల్లో ఆయన దురంధర్ సినిమాలో చూపిన రెహమాన్ డెకైత్ అవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు చెప్పారు. రేవంత్‌రెడ్డి మజ్లిస్ కనుసన్నల్లో పాలన చేస్తున్నారని ఆరోపించారు. మీర్‌జాఫర్‌లు, రెహమాన్ డెకైత్‌లు, రేవంతుద్దీన్‌లు ఎవరూ వద్దని.. మన జాతి కోసం, ధర్మం కోసం, దేశం కోసం పని చేసే బీజేపీ కావాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ‘సేవ్ తెలంగాణ’ పేరుతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సేవ్ తెలంగాణ పేరుతో సెల్‌ఫోన్ నంబరు 78787 83030లో రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్, కాంగ్రె్‌సలు అప్పుల తెలంగాణగా మార్చాయని ఆరోపించారు. గత పాలకుల కుంభకోణాలపై కేసీఆర్ కుమార్తెను అడిగితే చెబుతుందని.. కాంగ్రెస్ అవినీతిని మంత్రులను అడిగితే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక మునిసిపాలిటీలను లూటీ చేస్తోందన్నారు. 123 మునిసిపాలిటీలు అప్పుల ఊబిలో ఉన్నాయని.. ఈ పురపాలికల్లో రూ.3600 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. మరోసారి కాంగ్రె్‌సకు ఓటేస్తే, పన్నులు పెంచి ప్రజలపై భారం మోపుతారని చెప్పారు. మునిసిపాలిటీల్లో డబ్బులు సమర్పించుకోనిదే ఏ పనీ కావడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1500 మంది మునిసిపల్ సిబ్బందిపై ఏసీబీ కేసులు ఉన్నాయని.. కమిషనర్ల ఇళ్లలో బంగారం, రూ.కోట్ల నగదు దొరుకుతోందని చెప్పారు. రాష్ట్రంలో అవినీతి, కమీషన్లు, బుజ్జగింపుల పాలన సాగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను మరిచిపోయిందన్నారు. ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వకపోవడంతో 40 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. చేనేతలు, రైతులు, ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. బీజేపీ మూసీ అభివృద్ధిని అడ్డుకోవడం లేదని, మూసీ పరివాహంలో నివాసం ఉంటున్న వారిని ఆదుకొని అభివృద్ధి పనులు చేయాలని మాత్రమే చెబుతోందన్నారు. కేంద్రంలో బీజేపీ వన్ నేషన్.. వన్ ట్యాక్స్ అంటుంటే రాష్ట్రంలో రేవంత్ ట్యాక్స్, రాహుల్ ట్యాక్స్, 20శాతం బీ ట్యాక్స్ నడుస్తోందని చెప్పారు. ప్రజలకు విముక్తి కావాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు.
12 ఏళ్లుగా బానిస ప్రభుత్వాలే..
పదేళ్లు బీఆర్‌ఎస్, రెండేళ్లుగా కాంగ్రెస్ కలిపి తెలంగాణలో బానిస ప్రభుత్వాలను నడుపుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదని.. మజ్లిస్ కనుసైగల్లో పాలించే బానిస ప్రభుత్వమని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఒవైసీలకు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. రాహుల్, కేసీఆర్, ఖర్గేల మధ్య ఒప్పందం కుదిరిందని.. వీరిలో ఎవరికి ఓటేసినా మరొకరు లబ్ధి పొందుతారని చెప్పారు. బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన హైదరాబాద్ మేయర్ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ప్రజలు గమనించాలని కోరారు. కాంగ్రెస్ దృష్టిలో అభివృద్ధి అంటే అవినీతి, భూముల అమ్మకమేనని విమర్శించారు.ఈ ఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కు కాంగ్రె్‌సకు లేదన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దెబ్బతిందని, వ్యాపారులు ఆర్‌ఆర్ ట్యాక్స్‌తో వణికిపోతున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో వీధి లైట్లు కాలిపోతే కొత్తవి వేసే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ బంగారుబాతులా మారిందని.. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడ్నుంచే డబ్బు వెళ్తోందని ఆరోపించారు.