కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే అన్నదాతలకు కన్నీరు
ABN , Publish Date - May 28 , 2026 | 03:17 AM
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే అన్నదాతలు కన్నీరు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌కు అసెంబ్లీలోనూ సున్నా..
రైతు గోస - బీజేపీ భరోసా యాత్ర ఆగదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్, మే 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే అన్నదాతలు కన్నీరు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ‘‘చివరి గింజ వరకు కొంటాం’’ అని ప్రగల్భాలు పలికి, ఇప్పుడు రైతులను ఎందుకు రోడ్డున పడేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్ రావు బుధవారం విలేకరులతో మాట్లాడారు. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయని, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయి మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం అంచనాకు కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతుల కోసం బీజేపీ చేపట్టిన రైతు గోస-బీజేపీ భరోసా యాత్ర నిరంతరాయంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి వ్యతిరేకంగా పని చేస్తోందని ఆరోపించారు. బీజేపీ దేశం కోసం నిర్మాణాత్మకంగా పని చేస్తుంటే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు వినాశకరమైన ఆలోచనలతో ఉన్నాయని మండిపడ్డారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ కు పార్లమెంట్‌లో సున్నా ప్రాతినిధ్యం అయిందని, భవిష్యత్తులో అసెంబ్లీలోనూ వారికి సున్నానే వస్తుందని రాంచందర్ రావు పేర్కొన్నారు. కాగా, హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఐఆర్‌ఎస్ అధికారి, జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుడు సుధాకర్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు ఎన్.రాంచందర్ రావు సమక్షంలో బుధవారం బీజేపీలో చేరారు.