Share News

కరీంనగర్‌ పీఠంపై బీజేపీ ధీమా!

ABN , Publish Date - Feb 15 , 2026 | 07:03 AM

కరీంనగర్‌ కార్పొరేషన్‌ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నామని బీజేపీ సంపూర్ణ విశ్వాసంతో ఉంది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌గా ఎవరిని ఎన్నుకోవాలనే...

కరీంనగర్‌ పీఠంపై బీజేపీ ధీమా!

  • చివరి ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు

  • మద్దతివ్వాలంటే ‘కుర్చీ’ కావాలన్న బీఆర్‌ఎస్‌

  • ఓటింగ్‌లో మజ్లిస్‌సహా స్వతంత్రులే కీలకం

కరీంనగర్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్‌ కార్పొరేషన్‌ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నామని బీజేపీ సంపూర్ణ విశ్వాసంతో ఉంది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌గా ఎవరిని ఎన్నుకోవాలనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఎన్నికైన కార్పొరేటర్లు ఆదివారం సమావేశం కానున్నట్లు సమాచారం. కేంద్రమంత్రి బండి సంజయ్‌ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 66 డివిజన్లలో 30 డివిజన్లు బీజేపీ గెలుచుకోగా, కాంగ్రెస్‌ 14 స్థానాలను చేజిక్కించుకున్నది. బీఆర్‌ఎస్‌ 9 స్థానాల్లో, ఫార్వర్డ్‌బ్లాక్‌ 2 స్థానాల్లో, ఎంఐఎం 3 స్థానాల్లో, ఇండిపెండెంట్లు 8 స్థానాల్లో గెలుపొందారు. స్థానిక ఎంపీ హోదాలో బండి సంజయ్‌, కరీంనగర్‌ పరిధిలో ఓటర్లుగా ఉన్న ఎమ్మెల్యేల కోటాలో గంగుల కమలాకర్‌, కవ్వంపల్లి సత్యనారాయణ... ఎక్స్‌ అఫీషియో ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈ లెక్కన మేయర్‌ పీఠం దక్కించుకోవాలంటే.. ఏ పార్టీకైనా 35 ఓట్లు రావాల్సి ఉంటుంది. బండి సంజయ్‌ ఎక్స్‌ అఫీషియో ఓటుతో కలిపి బీజేపీ సొంతంగా 31 ఓట్లు కలిగి ఉంది. ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక ఫార్వర్డ్‌ బ్లాక్‌ సభ్యురాలు తమ పార్టీలో చేరారని, సంపూర్ణ మెజార్టీతో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను దక్కించుకుంటామని బండి సంజయ్‌ ఇప్పటికే ప్రకటించారు.


మరోవైపు కాంగ్రెస్‌ నేతలు మాత్రం తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. తమ ఖాతాలో 14 మంది కార్పొరేటర్లు ఉండగా, ఎంఐఎంకు చెందిన ముగ్గురు, ఫార్వర్డ్‌ బ్లాక్‌కు చెందిన ఒకరు, ఇండిపెండెంట్లు ఐదుగురు, ఒక ఎక్స్‌ అఫీషియో సభ్యుడి ఓట్లు తమకున్నాయని, బీఆర్‌ఎ్‌సకు చెందిన 9 మంది కార్పొరేటర్లు, ఒక ఎక్స్‌ఆఫిషియో సభ్యుడు మద్దతిస్తే తమ బలం 34కు చేరుతుందని ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీ విప్‌ జారీ చేస్తే.. బీజేపీలో చేరిన సభ్యురాలు సైతం తమకే మద్దతు ఇస్తారని, మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే, బీఆర్‌ఎస్‌ మాత్రం ఈ విషయంలో అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు. బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్‌ నేతలు మా మద్దతు కోరారు. అయితే వారిని మేయర్‌ పదవి ఇస్తారా అని అడిగాం. వారి నుంచి ఎలాంటి సమాధానం లేదు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ అభివృద్ధిని కాంక్షించే వారిగా మా పార్టీ నిర్ణయం ఉంటుంది’’ అని పేర్కొన్నారు. మేయర్‌ పదవినో, డిప్యూటీ మేయర్‌ పదవినో ఇస్తే బీఆర్‌ఎస్‌ మద్దతు తెలుపుతుందా? లేదా? అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం మూడు పార్టీల క్యాంపులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఈ నెల 16న ఓటు వేసే సమయానికి వారు కరీంనగర్‌ చేరుకుంటారని చెబుతున్నారు. ఇప్పటికే నలుగురు కమలం గూటికి చేరడంతో బీజేపీకే విజయావకాశాలు ఉన్నాయని, ఆ పార్టీ వెంటే ఉంటే తమ డివిజన్లకు కూడా అధిక నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేసుకునే అవకాశముంటుందనే ఆలోచనతో కొందరు స్వతంత్రులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మేయర్‌ పీఠం ఎన్నికలో మజ్లిస్‌, స్వంతత్ర అభ్యర్థులే కీలకం కానున్నారు.

Updated Date - Feb 15 , 2026 | 07:03 AM