Share News

‘తాడిచర్ల’ కేటాయింపు బీజేపీ కృషి వల్లే..

ABN , Publish Date - Jul 09 , 2026 | 05:29 AM

బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకుల సమష్టి కృషితో పాటు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తీసుకున్న ప్రత్యేక చొరవ వల్ల మాత్రమే ‘తాడిచర్ల-2’ బొగ్గు బ్లాక్‌ కేటాయింపు సాధ్యమైందని..

‘తాడిచర్ల’ కేటాయింపు బీజేపీ కృషి వల్లే..

  • నష్టాల్లోకెళ్లిన సింగరేణిని మోదీ ప్రభుత్వమే ఆదుకుంది

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు

హైదరాబాద్‌, జూలై 8(ఆంధ్రజ్యోతి): బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకుల సమష్టి కృషితో పాటు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తీసుకున్న ప్రత్యేక చొరవ వల్ల మాత్రమే ‘తాడిచర్ల-2’ బొగ్గు బ్లాక్‌ కేటాయింపు సాధ్యమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌ రావు స్పష్టం చేశారు. ఈ బ్లాక్‌ను వారి ప్రయత్నాల వల్లే సాధించుకున్నామని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పుకోవడం అవాస్తవమని ఆయన మండిపడ్డారు. గతంలో కేంద్రంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి ఎందుకు కేటాయించలేకపోయారో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం ‘తాడిచర్ల-2’ బొగ్గు బ్లాక్‌ను కేటాయించడం పట్ల తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సుమారు 182 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలున్న ఈ బ్లాక్‌ ద్వారా సింగరేణి సంస్థకు రూ.64,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరనుందని, అలాగే దాదాపు 1,200 మంది నిరుద్యోగ యువతకు కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. కాగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సింగరేణి సంస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, నష్టాల్లోకి నెట్టేస్తే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే ఆ సంస్థను బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో ‘ధరణి’ పోర్టల్‌లో భారీగా ఫేక్‌ అకౌంట్లు సృష్టించారని, వాటిపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనని రాంచందర్‌ రావు డిమాండ్‌ చేశారు.


కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన కేవలం రెండున్నరేళ్ల కాలంలోనే సుమారు 2 వేల ఫేక్‌ అకౌంట్లు వెలుగుచూడటం ఆందోళనకరమన్నారు. ప్రస్తుతం ధరణిపై విచారణ జరుపుతున్న ‘సిట్‌’ పరిధిని వెంటనే విస్తరించాలని, ‘భూభారతి’లో జరుగుతున్న అవకతవకలపైనా సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అవకతవకలు బయటపడుతున్న నేపథ్యంలోనే ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరాన్ని కాస్తా ‘‘డ్రామేశ్వరం’’ గా మారుస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టాలని హితవు పలికారు. లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి, రైతులకు సాగునీరు అందించి ఉపయోగపడేలా చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 09 , 2026 | 05:30 AM