పునర్విభజనపై సీఎం అసత్య ప్రచారం
ABN , Publish Date - Apr 16 , 2026 | 03:52 AM
నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదిస్తున్న హైబ్రిడ్ విధానం ప్రపంచంలో ఎక్కడా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఎద్దేవా చేశారు.
హైబ్రిడ్ విధానం అంటూ అర్థం లేని మాటలు.. రేవంత్‌రెడ్డికి రాజ్యాంగంపై అవగాహన లేదు
మహిళా బిల్లును అడ్డుకునేందుకే రాద్ధాంతం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు
వరంగల్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదిస్తున్న హైబ్రిడ్ విధానం ప్రపంచంలో ఎక్కడా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డికి రాజ్యాంగంపై అవగాహన లేదని, అందుకే పునర్విభజనపై అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వరంగల్‌లో బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాంచందర్‌రావు.. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను 30 శాతమో, 50శాతమో పెంచడం వల్ల ఏ ప్రాంతానికీ నష్టం జరగదని అభిప్రాయపడ్డారు. 70 కోట్ల జనాభాకు 543 లోక్‌సభ సీట్లు ఉంటే, ప్రస్తుతం 140కోట్ల జనాభాకు సీట్ల సంఖ్య 800కుపైగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. హైబ్రిడ్ విధానంతో దేశంలో పేద, ధనిక నియోజకవర్గం అంటూ విభజించి, ప్రజల్లో అసమానతలను సృష్టించేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య విభజన తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. పునర్విభజన తర్వాత దక్షిణాదిలోనూ బీజేపీ బలపడుతుందేమోనని కాంగ్రెస్ భయపడుతోందని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకునేందుకే పునర్విభజనపై రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో మహిళా బిల్లును ప్రవేశపెడితే.. ఆ పార్టీ మిత్ర పక్షాలే చించివేసింది వాస్తవం కాదా? అని నిలదీశారు. ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు ఎన్డీఏ పక్షాలన్నీ నియోజకవర్గాల పునర్విభజనకు మద్దతు ఇస్తున్నాయని, ప్రతిపక్షాలు కూడా కలిసి రావాలని కేంద్రం కోరుతోందన్నారు. ఇక, అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే.. రేవంత్‌రెడ్డి చెప్పినట్లు విభజిస్తే హైదరాబాద్ పరిసరాల్లోనే నియోజకవర్గాలు పెరుగుతాయని, ఇతర జిల్లాల్లో నియోజకవర్గాలు పెరగాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అన్ని జిల్లాల్లో సమానంగా నియోజకవర్గాలను పెంచేందుకు తాము ప్రయత్నిస్తుంటే.. రేవంత్ అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేసిన రేవంత్.. ఎవరిని అడిగి విభజన చేశారని నిలదీశారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని రాంచందర్‌రావు ఆరోపించారు. హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ఎదుట సమస్యల పరిష్కారం కోసం రిలే దీక్షలు చేస్తున్న ఆర్టిజన్లకు ఆయన సంఘీభావం తెలిపారు. ఆర్టిజన్ల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాస్తానని హామీ ఇచ్చారు.