నెలాఖరులో రాష్ట్రానికి నితిన్ నబిన్
ABN , Publish Date - Jun 19 , 2026 | 03:26 AM
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాష్ట్ర పర్యటన ఈనెలాఖరులో కొనసాగనుంది. గురువారం ఢిల్లీ వెళ్లిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆయనతో భేటీ అయ్యారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, న్యూఢిల్లీ, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాష్ట్ర పర్యటన ఈనెలాఖరులో కొనసాగనుంది. గురువారం ఢిల్లీ వెళ్లిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలను రాంచందర్‌రావు నితిన్‌కు వివరించారు. రైతులకు మద్దతుగా చేపట్టిన బస్సుయాత్రతో రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందని తెలిపారు. రైతాంగానికి మద్దతుగా నిలుస్తూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నితిన్ నబిన్ ప్రశంసించారు. కాంగ్రె్‌సకు బీజీపీనే ప్రత్యామ్నాయంగా ప్రజలు భావిస్తున్నారని రాంచందర్‌రావు తెలిపారు. బీఆర్‌ఎస్ రోజురోజుకూ బలహీనమవుతోందని, అంతర్గత తగాదాలు, నాయకత్వ బలహీనతల వల్ల ఆ పార్టీ అస్తిత్వం కోల్పోతోందని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలను గట్టిగా తిప్పిగొడుతున్నానని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తదితర నేతలతో కలిసికట్టుగా కార్యాచరణ చేపట్టామని చెప్పారు. తెలంగాణలో పార్టీ కార్యక్రమాలను ఇదే జోష్‌తో కొనసాగించాలని రాంచందర్‌రావుకు నితిన్ సూచించారు. కాగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి నితిన్ నబిన్‌ను ఆహ్వానించినట్లు రాంచందర్‌రావు తెలిపారు. రాష్ట్ర పర్యటన సందర్భంగా నితిన్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరవడంతో పాటు ఒక జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీవర్గాలు తెలిపాయి. పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నితిన్ తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఉత్తర తెలంగాణ (వరంగల్ జిల్లా)లో ఆయన పర్యటన కొనసాగే అవకాశం ఉందని పార్టీవర్గాలు వెల్లడించాయి.