Share News

డీలిమిటేషన్‌పై సీఎం అబద్ధాలు

ABN , Publish Date - Mar 26 , 2026 | 04:49 AM

లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్‌ ప్రక్రియపై సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు మండిపడ్డారు.

డీలిమిటేషన్‌పై సీఎం అబద్ధాలు

  • ప్రక్రియ మొదలు కాకముందే ఉత్తరాదిలో నియోజకవర్గాలు ఎక్కువ పెరుగుతాయని ఎలా చెప్తారు?

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు ప్రశ్న

  • వందేమాతరం గీతాన్ని అవమానించిన ఎంఐఎం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు ఫిర్యాదు

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్‌ ప్రక్రియపై సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టం జరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి అబద్ధాలు ప్రచారం చేస్తారా? డీలిమిటేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాకముందే ఉత్తరాదిలో ఎక్కువ సీట్లు పెరుగుతాయని, దక్షిణాదికి తక్కువ అవుతాయని మీకెవరు చెప్పారు? అని నిలదీశారు. రేవంత్‌ వైఖరి చూస్తుంటే రాహుల్‌గాంధీని తప్పించి కాంగ్రెస్‌ నాయకత్వ బాధ్యతలు తీసుకునేలా ఉన్నారని వ్యాఖ్యానించారు. దేశాన్ని ఉత్తరాది, దక్షిణాది అని విభజించవద్దన్నారు. బీజేపీలో మాదిరిగా దక్షిణ భారతదేశ నాయకులను గౌరవించే సంస్కృతి కాంగ్రెస్‌ పార్టీలో ఉందా? అని ప్రశ్నించారు. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌తో పాటు కేంద్ర క్యాబినెట్‌లో కీలకమైన ఆర్థిక, విదేశాంగ, సాంస్కృతిక, బొగ్గు, గనులశాఖలను దక్షిణాది నాయకులకు కట్టబెట్టిన ఘనత ప్రధాని మోదీదే అని అన్నారు. శాసనసభలో వందేమాతరం గీతాన్ని ఎంఐఎం ఎమ్మెల్యేలు అవమానించారని ఆరోపించారు. స్పీకర్‌తో మాట్లాడి వారి సభ్యత్వాలను రద్దు చేయించాలని గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లాను కోరారు. ఈ మేరకు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో బీజేపీ ప్రతినిధి బృందం బుధవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మజ్లిస్‌ నాయకులకు ‘భారత్‌ మాతా కీ జై’ అనడం రాదు, ‘జై హింద్‌’ అనడం రాదు కానీ.. ‘జై పాలస్తీనా’ అంటారని విమర్శించారు. సభలో వందేమాతరం ఆలపించే సమయంలో వాకౌట్‌ చేయడం సభ నిబంధనలకు విరుద్ధమని, దేశానికి తీరని అవమానమని అన్నారు. కాగా, రాంచదర్‌రావు సమక్షంలో రాజేంద్రనగర్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు యువకులు బుధవారం బీజేపీలో చేరారు.

Updated Date - Mar 26 , 2026 | 05:01 AM