చలో టు క్యాంప్!
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:56 AM
కొన్ని గంటల్లో మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కమలం పార్టీ నాయకత్వం, క్యాంప్ రాజకీయాలకు తెరతీసింది.
‘సురక్షిత’ ప్రాంతాలకు బీజేపీ అభ్యర్థుల తరలింపు
మహారాష్ట్ర, అయోధ్య, ఛత్తీ్‌సగఢ్‌లో ప్రత్యేక శిబిరాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): కొన్ని గంటల్లో మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కమలం పార్టీ నాయకత్వం, క్యాంప్ రాజకీయాలకు తెరతీసింది. ప్రత్యర్థుల ప్రలోభాలకు పాల్పడతారేమోనన్న అనుమానంతో అభ్యర్థులను ‘సురక్షిత ’ ప్రాంతాలకు తరలిస్తోంది. వార్డు, కార్పొరేటర్ అభ్యర్థులు, తమ ప్రత్యర్థుల వలకు చిక్కకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ముఖ్యంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్న ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉందని భావిస్తున్న పార్టీ నాయకత్వం, అక్కడి మునిసిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్ర పార్టీ నాయకత్వం సూచనల మేరకు ఆయా మునిసిపాలిటీల నుంచి అభ్యర్థులను క్యాంప్‌లకు తరలిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని పలు మునిసిపాలిటీలకు సంబంధించి అభ్యర్థుల తరలింపు ప్రక్రియ గురువారమే ప్రారంభమైంది. మిగతా ఉమ్మడి జిల్లాల పరిధిలోని అభ్యర్థులను శుక్రవారం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. తాము గెలిచే అవకాశం ఉన్న మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లతో పాటు, హంగ్ ఏర్పడే అవకాశం ఉన్న మునిసిపాలిటీల్లో తమ అభ్యర్థులు, ప్రత్యర్థులకు చిక్కకుండా చర్యలు తీసుకున్నట్లు బీజేపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. ‘కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్‌లను కైవసం చేసుకుంటామన్న ధీమాతో మా నాయకత్వం ఉంది. వీటితో పాటు కనీసం పది మునిసిపాలిటీల్లో చైర్మన్ పదవి మాకే దక్కే అవకాశం ఉండగా, మరో 20-25 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడితే మేం కింగ్‌మేకర్‌లమవుతామని అంచనా వేస్తున్నాం. అందుకే, ఆయా కేంద్రాల్లో పార్టీ అభ్యర్థులు, ప్రత్యర్థుల వలకు చిక్కకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం’ అని వివరించారు. కొన్ని మునిసిపాలిటీల్లో అధికార పార్టీ నేతలు ఇప్పటికే మంతనాలు ప్రారంభించినట్లు తమకు సమాచారం వచ్చిందని మరో ముఖ్యనేత వెల్లడించారు. కాగా మునిసిపల్, కార్పొరేషన్‌ల ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనుండగా.. చైర్మన్, మేయర్‌ల ఎన్నిక 16న జరుగనున్న సంగతి తెలిసిందే. ఫలితంగా గెలిచిన అభ్యర్థులతో శుక్రవారమే క్యాంప్‌లకు తరలించాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక లగ్జరీ బస్సులు ఏర్పాటుచేశారు. బీజేపీ అధికారంలో ఉన్న పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌తో పాటు యూపీలోని అయోధ్య కేంద్రంగా క్యాంప్‌లు నిర్వహించనున్నారు. ఈనెల 16న ఉదయం వీరు ఆయా మునిసిపాలిటీలకు తిరిగివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొంతమంది అభ్యర్థులతో పాటు వారి కుటుంబసభ్యులను కూడా క్యాంప్‌లకు తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, శుక్రవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఓడిపోయిన అభ్యర్థులు అదేరోజు సాయంత్రం తిరిగొచ్చేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు.
మా పార్టీ అభ్యర్థులకు అధికార పార్టీ ప్రలోభాలు: బండి సంజయ్
కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలతో, తమపార్టీ అభ్యర్థులను లాక్కునే ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. గురువారం, పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లతో సంజయ్ కరీంనగర్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థులకు ఆయన సూచించారు. పార్టీని మోసం చేస్తే కన్నతల్లిని మోసం చేసినట్లే అని సంజయ్ తేల్చిచెప్పారు. ‘కాంగ్రెస్ ఆశలకు లోబడి ఎవరైనా స్పందిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి... అలాంటివాళ్లు కార్యకర్తల ఆగ్రహానికి గురవ్వాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు. కరీంనగర్‌లో మెజారిటీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకోబోతోందని సంజయ్ వెల్లడించారు. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించబోతున్నామని ప్రకటించారు.