రాజ్యాంగ నైతికతకు దక్కిన విజయం
ABN , Publish Date - Sep 25 , 2026 | 06:22 AM
ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ నైతికతకు దక్కిన చరిత్రాత్మక విజయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు గుణపాఠం: కిషన్‌రెడ్డి
ఆ రెండు పార్టీలు సిగ్గు పడాలి: సంజయ్
హైదరాబాద్/న్యూఢిల్లీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ నైతికతకు దక్కిన చరిత్రాత్మక విజయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎంతటివారైనా రాజ్యాంగానికి తలవంచాల్సిందేనని, అంతిమంగా సత్యమే గెలుస్తుందని సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి రుజువైందని స్పష్టం చేశారు. ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు బీజేపీ శాసనసభా పక్షం చేసిన న్యాయపోరాటం వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైంది. చట్టసభలు ‘ఆయారాం, గయారాం’లకు అడ్డా కాకూడదని, ‘ఘర్ వాపసీ’ల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేరని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ అహంకారానికి గట్టి చెంపపెట్టు’ అని వ్యాఖ్యానించారు. దానం నాగేందర్ అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణలో ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ఒక గుణపాఠమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, వారికి మంత్రి పదవులు ఇవ్వడం వంటి దురదృష్టకర సంస్కృతిని ప్రోత్సహించింది ఆ రెండు పార్టీలేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలేనని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కుళ్లు రాజకీయాలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పును చూసైనా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు సిగ్గుతో తలదించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ‘ఆయారాం, గయారాం...ఫిర్ ఘర్ వాపస్ ఆయారాం....ఇదేనా మీ సంస్కృతి?’ అని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. అవకాశవాద, అధికార రాజకీయాల కోసం ఫిరాయింపులను ప్రోత్సహిస్తారా? అని నిలదీశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసే అర్హత కూడా కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సకు లేదని మండిపడ్డారు. హిందూ బంధువులందరూ కలిసి కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సను రాజకీయ నిమజ్జనం చేయాలని పిలుపునిచ్చారు. కాగా, తెలంగాణలో ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలందరినీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు.
ఒక పార్టీ గుర్తుపై గెలిచి ఇంకో పార్టీపై పోటీ చేయడం అనైతికమని, ఫిరాయింపు రాజకీయాలకు సుప్రీంకోర్టు తీర్పు చెంప పెట్టు అని పేర్కొన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేఎల్పీ పోరాటం వల్లేహైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. రాజ్యాంగం గురించి రాహుల్‌గాంధీ మాట్లాడేది ఒకటి.. చేసేది మరొకటి అని విమర్శించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం అని ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలు కూడా తక్షణం రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.