Share News

వచ్చే కార్పొరేషన్‌ ఎన్నికలు సెమీ ఫైనల్‌

ABN , Publish Date - Mar 22 , 2026 | 05:47 AM

రానున్న హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి కార్పొరేషన్ల ఎన్నికలు బీజేపీకి సెమీ ఫైనల్‌ అని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్‌ అని బీజేపీ నేతలు అన్నారు.

వచ్చే కార్పొరేషన్‌ ఎన్నికలు సెమీ ఫైనల్‌

  • అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్‌

  • మూడు కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగురవేయాలి

  • డివిజన్‌ అధ్యక్షుల సమావేశంలో బీజేపీ నేతల పిలుపు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రానున్న హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి కార్పొరేషన్ల ఎన్నికలు బీజేపీకి సెమీ ఫైనల్‌ అని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్‌ అని బీజేపీ నేతలు అన్నారు. మూడు కార్పొరేషన్ల ఎన్నికలను పార్టీ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, మూడుచోట్లా కాషాయ జెండా ఎగురవేసేలా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యం కావాలన్నారు. శనివారం సికింద్రాబాద్‌లోని క్లాసిక్‌ గార్డెన్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని జిల్లాల అధ్యక్షులు, డివిజన్‌ అధ్యక్షులు, పదాధికారులు, క్రియాశీల సభ్యులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, పార్టీ నిర్వాహక కార్యదర్శి చంద్రశేఖర్‌ తివారీ, ఎంపీలు డాక్టర్‌ లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌, రఘునందనరావు తదితరులు పాల్గొన్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని, బస్తీలు, కాలనీల సమస్యలను గుర్తించి పరిష్కారానికి పనిచేయాలని నాయకులు సూచించారు. వచ్చే కార్పొరేషన్‌ ఎన్నికల్లో టికెట్లు ఆశించేవారిపై సర్వే చేయిస్తామని చెప్పారు. ప్రజల్లో ఆదరణ, అభిమానం ఉండి, గెలిచే అభ్యర్థులకే టికెట్‌ కేటాయిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో రొహింగ్యాలు, బంగ్లాదేశ్‌ వంటి ఇతర దేశాల నుంచి అక్రమంగా వచ్చిన వారు ఓటు నమోదు చేయించుకున్నారని, ఒక్కో ఇంటిలో 30 నుంచి 40 ఓట్లు ఉన్నాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. కార్పొరేషన్‌, అసెంబ్లీ ఎన్నికల నాటికి గ్రేటర్‌ హైదరాబాద్‌లో దొంగ ఓట్లు లేని ఓటర్ల జాబితా ఉండేలా చూడాలని సూచించారు.

సర్‌ కమిటీల ఏర్పాటు

గ్రేటర్‌ హైదరాబాద్‌లో అక్రమంగా ఓటు నమోదు చేసుకున్న వారిని గుర్తించేందుకు సర్‌ కమిటీలను నియమించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి నలుగురు క్రియాశీల సభ్యులతో ఈ కమిటీలను ఏర్పాటు చేశారు.

Updated Date - Mar 22 , 2026 | 05:48 AM