బీజేపీ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:52 AM
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమల్లో విఫలమైందంటూ సోమవారం బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది.
దశల వారీగా అసెంబ్లీ వద్దకు పార్టీ శ్రేణులు.. అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్/సిటీ/పంజాగుట్ట/గన్‌పార్క్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమల్లో విఫలమైందంటూ సోమవారం బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు దశల వారీగా పెద్దసంఖ్యలో అసెంబ్లీ వద్దకు చేరుకోగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మహిళా నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారు రోడ్డుపైనే బైఠాయించి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చిన పార్టీ నాయకులను పోలీసులు నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించి సాయంత్రం విడుదల చేశారు. నాంపల్లి ప్రాంతం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు ర్యాలీగా వచ్చి అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు వ్యూహాత్మకంగా ఆటోలో అసెంబ్లీ వద్దకు చేరుకోగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని పంజాగుట్ట స్టేషన్‌కు తరలించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు రాంచందర్‌రావుకు మద్దతుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ప్రభుత్వ చర్యను ఖండించారు.
ప్రజాగ్రహాన్ని అణిచివేయలేరు..
అక్రమ అరెస్టులతో ప్రజాగ్రహాన్ని అణిచివేయలేరని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాంచందర్‌రావుతోపాటు పార్టీ నాయకుల అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన నడుస్తోందా? పోలీసు బలగాలతో నడిపిస్తున్నారా? అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే అరెస్టు చేస్తారా? అని మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 26 నెలలైనా ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని మరింత దివాళా తీయిస్తున్నారు తప్ప.. ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేకుండా పోయిందని విమర్శించారు. కాగా, బీజేపీ నాయకుల అరెస్టును ఎంపీ ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీకరెడ్డి ఖండించారు.
పోరాటం ఉధృతం చేస్తాం..
కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాటం ఉధృతం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు, వాగ్దానాలను పూర్తిగా విస్మరించిందని, ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటి కూడా ప్రజలకు చేరడం లేదని ధ్వజమెత్తారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప.. మిగతా గ్యారంటీలన్నింటినీ పక్కనబెట్టి, అమలు చేసినట్లు ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని వర్గాల వారికి ప్రత్యేక డిక్లరేషన్లు విడుదల చేసి, లక్షలాది కుటుంబాలను నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా వందలాది మంది కార్యకర్తలను, మహిళలను, అక్రమంగా అరెస్ట్ చేశారని, జిల్లాల నుంచి వస్తున్న శ్రేణులను అడ్డుకున్నారని, అర్ధరాత్రి నుంచే నాయకులను గృహనిర్బంధం చేశారని మండిపడ్డారు.