పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:58 AM
రాష్ట్రంలో రాజకీయ దాడులు పెచ్చుమీరుతున్నాయని, పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు ఫిర్యాదు చేశారు.
డీజీపీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఫిర్యాదు
ఆరెస్సెస్‌నుపై కాంగ్రెస్ డిమాండ్ విడ్డూరమని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీది దేశ వ్యతిరేక వైఖరి : కిషన్ రెడ్డి
హైదరాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాజకీయ దాడులు పెచ్చుమీరుతున్నాయని, పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు ఫిర్యాదు చేశారు. తమ పార్టీకి చెందిన పలువురు నేతలతో కలిసి రాంచందర్‌రావు డీజీపీని మంగళవారం స్వయంగా కలిసి ఓ వినతిపత్రం అందజేశారు. నల్లగొండ జిల్లా చుండూరులో బీజేపీ నాయకులపై జరిగిన హత్యాయత్నాన్ని ఈ సందర్భంగా డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ దాడిలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారని, కానీ పోలీసులు నిందితులకు అనుకూలంగా బలహీనమైన సెక్షన్లతో కేసు నమోదు చేశారని తెలిపారు. అలాగే, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బీజేపీ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన ఘటనలోనూ స్థానిక పోలీసులు బాధితులపైనే కేసులు పెట్టి పక్షపాతంగా వ్యవహరించారని వివరించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిపై డీఎస్పీ అనాగరికంగా వ్యవహరించిన వైనాన్ని కూడా డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. అధికార కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో పని చేస్తూ ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని డీజీపీని కోరారు.
యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ అంశంలో కాంగ్రెస్ తీరును ఖండిస్తున్నాం
అమెరికాకు చెందిన యూఎ్‌ససీఐఆర్‌ఎఫ్ సంస్థ నివేదిక విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వేర్వేరుగా ప్రకటించారు. ఆరెస్సెస్‌ను నిషేధించాలన్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్ విడ్డూరంగా ఉందని రాంచందర్‌రావు అన్నారు. యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ అనే ఓ పక్షపాత సంస్థ ఇచ్చిన నివేదికను పట్టుకొని కాంగ్రెస్ మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. ఆ సంస్థ మన దేశ గూఢచారి విభాగమైన ‘రా’ ని కూడా నిషేధించాలని సిఫారసు చేసిందని, ఆరెస్సెస్‌ను నిషేధించమంటున్న కాంగ్రెస్.. ‘రా’ ని కూడా రద్దు చేయమంటుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ శాసనసభలో వందేమాతరం గీతాలాపన సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేల వాకౌట్‌పై తమ వైఖరి ఏంటో కాంగ్రెస్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇక, యూఎ్‌ససీఐఆర్‌ఎఫ్ సంస్థ నివేదిక అంశంలో కాంగ్రెస్ వైఖరిని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తప్పుబట్టారు. విదేశీ సంస్థలతో అంటకాగుతూ కాంగ్రెస్ తన దేశ వ్యతిరేక వైఖరిని చాటుకుందని తెలిపారు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, రాష్ర్టీయ స్వయం ేసవక్ సంఘ్ వంటి సంస్థలను లక్ష్యంగా చేసుకోని మాట్లాడటం కాంగ్రెస్ దుర్మార్గానికి పరాకాష్ఠ అన్నారు. యూఎ్‌ససీఐఆర్‌ఎఫ్ నివేదికను ఖండిస్తున్నామని చెప్పారు.
ఎమ్మెల్యే సామేలుపై చర్యలకు వీహెచ్‌పీ డిమాండ్
రాజ్యాంగ విరుద్ధంగా వ్యహరిస్తూ, హిందుత్వాన్ని అవమానించే విధంగా మాట్లాడిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ విశ్వహిందూపరిషత్ రాష్ట్ర ధర్మాచార్య బాలస్వామి రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. సామేలు వ్యాఖ్యలు కులాల పట్ల విభేదాలు రగిలించేలా ఉన్నాయని, ఎస్సీ కులానికి చెందిన సర్టిఫికెట్‌ను ఉపయోగించుకుంటూ క్రైస్తవ జీవన విధానాన్ని అనుసరిస్తున్న వ్యక్తి రిజర్వేషన్ ప్రయోజనాలను పొందడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని బాలస్వామి పేర్కొన్నారు.