BJP state president N. Ramachandra Rao: సీఎం రేవంత్ కబ్జాకోరు
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:50 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కబ్జాకోరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు. అందినకాడికి భూములన్నీ అమ్ముకుంటూ .....
భూములు అమ్మిన డబ్బులతోనే పరిపాలన
కేయూ భూములను అమ్మేందుకు యత్నాలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హనుమకొండ, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కబ్జాకోరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు. అందినకాడికి భూములన్నీ అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతోనే పరిపాలన సాగిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి వరంగల్‌కు వచ్చిన ఆయన హనుమకొండలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన వంద ఎకరాలను అమ్మేశారని, మౌలానా ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించిన వేల కోట్ల రూపాయల విలువైన 50 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం స్వాధీనం చేసుకున్నారని రాంచందర్‌రావుు ఆరోపించారు. ఇప్పుడు కాకతీయ విశ్వవిద్యాలయం భూములపై కన్నేసి, వాటిని కూడా అమ్మకానికి పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటుతుందని రాంచందర్‌రావుు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని గెలిపిస్తే కేంద్రం నిధులతో పట్టణాలను సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం పెరగడంతోనే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. కేసీఆర్ ఓటీపీలాగా అసెంబ్లీకి ఒకసారి వచ్చి మాయమైపోయారని ఆయన చెప్పారు.