Share News

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్‌ విఫలం

ABN , Publish Date - May 26 , 2026 | 04:27 AM

ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ఆరోపించారు. ధాన్యం మొత్తం కొనుగోలు చేసేశామని....

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్‌ విఫలం

  • మిల్లర్లు, వ్యాపారులకు లాభం చేకూర్చే యత్నం.. హమాలీలు లేరు.. వసతులు కరువయ్యాయి

  • తడిసిన ధాన్యాన్నీ కొనాల్సిందే: రాంచందర్‌రావు

  • తరుగు ధాన్యం ఎవరి జేబులోకి వెళ్తోంది?: ఏలేటి

  • వరంగల్‌ డిక్లరేషన్‌ ఏమైంది?: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

  • వికారాబాద్‌, గజ్వేల్‌లో రైతు గోస- బీజేపీ భరోసా యాత్ర

హైదరాబాద్‌/గజ్వేల్‌/వికారాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ఆరోపించారు. ధాన్యం మొత్తం కొనుగోలు చేసేశామని, కొంతే మిగిలి ఉందంటూ ఇప్పటికీ అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. తేమ ఉన్నా, తడిసినా.. ధాన్యం చివరి గింజ వరకూ కొనుగోలు చేయాల్సిందేనని, రైతులకు న్యాయం జరిగే వరకూ బీజేపీ అన్నదాతలకు అండగా ఉంటుందని, ప్రభుత్వంపై పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు బీజేపీ చేపట్టిన రైతు గోస- బీజేపీ భరోసా యాత్ర సోమవారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రారంభమైంది. తొలి రోజు వికారాబాద్‌ జిల్లాలోని కులకచర్ల, సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బీజేపీ నేతలు.. రైతులతోనూ మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడెక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నారో గుర్తించి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఈ యాత్ర చేపట్టామన్నారు. వికారాబాద్‌ జిల్లాలో తాము పర్యటించనున్నామన్న సమాచారంతో రాత్రికి రాత్రి రైతుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారని తెలిపారు. రాష్ట్రంలోని చాలా కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు లేరని, లారీలు అందుబాటులో లేవన్నారు. పదిహేను రోజులుగా రైతులు ధాన్యం కుప్పల వద్దే కాపలా కాస్తున్నా.. టార్పాలిన్లు, గోనె సంచులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే తక్కువకే కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. అదే సమయంలో మిల్లర్లు, వ్యాపారులకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.


చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులకు ఇబ్బందులకు గురిచేయకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం దగా చేసిందని విమర్శించారు. 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, క్షేత్ర స్థాయిలో 75 శాతంపైగా ధాన్యం కల్లాల్లోనే మగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో వర్షాలు కురిస్తే తడిసిన ధాన్యాన్ని కొనే నాథుడే ఉండడని, అన్నదాతలు దళారులను ఆశ్రయించి నష్టపోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వమే కల్పిస్తోందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో ఒక్కో బస్తాకు ఏకంగా నాలుగు కిలోల అదనపు తరుగు తీస్తూ రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ, తరుగు పేరిట రైతుల వద్ద దోచుకుంటున్న 9లక్షల టన్నుల ధాన్యం ఎవరి జేబులోకి పోతోందని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల గోస ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. సీఎంకు రియల్‌ ఎస్టేట్‌పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని మండిపడ్డారు. ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. మెదక్‌ ఎంపీ రఘుందన్‌ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సకాలంలో లారీలు పంపకుండా జాప్యం చేస్తున్నారన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రైతుల కోసం ప్రకటించిన వరంగల్‌ డిక్లరేషన్‌ ఏమైందని ప్రశ్నించారు.

Updated Date - May 26 , 2026 | 04:27 AM